తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదో తరగతి విద్యార్థిపై దాడి చేసి చంపిన ఏనుగు.. హెలికాప్టర్ పంపిన సీఎం!

బంగాల్​లో గురువారం ఓ గజరాజు రెచ్చిపోయింది. పదో తరగతి బోర్డు పరీక్షలు రాసేందుకు తండ్రితో కలిసి వెళ్తున్న ఓ విద్యార్థిని వెంటాడి మరీ చంపేసింది. ఇదిలా ఉంటే మృతుడి తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెరుగైన చికిత్స కోసం ఆమెకు ప్రత్యేకంగా హెలికాప్టర్​ను ఏర్పాటు చేశారు!

By

Published : Feb 23, 2023, 10:21 PM IST

Bengal Boy Died In Elephant Attack
ఏనుగు దాడిలో పదో తరగతి విద్యార్థి మృతి

పదో తరగతి బోర్డు పరీక్షలు రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థి ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిని ఏనుగు వెంబడించి మరీ దాడి చేసిందని స్థానికులు తెలిపారు. బంగాల్​ రాష్ట్రంలోని జల్పాయ్​గుడి జిల్లాలో ఈ ఘోరం జరిగంది. బైకుంఠపుర్ అటవీ సమీపంలోని మహారాజ్ ఘాట్ ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న అర్జున్ దాస్ అనే బాలుడు తన తండ్రి విష్ణుతో కలిసి నివసిస్తున్నాడు. గ్రామంలోని పచ్చిరామ్ నహతా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అర్జున్​కు బెలకోబా పట్టణంలోని బొట్టల్లా పాఠశాలలో ఎగ్జామ్​ సెంటర్​ పడింది. ఈ క్రమంలోనే అర్జున్​ తన తండ్రి విష్ణుతో కలిసి మోటార్​బైక్​పై పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు. అప్పుడే అడవిలో నుంచి అకస్మాత్తుగా ఓ ఏనుగు వచ్చి వారి బైక్​ ముందు నిల్చుంది. ఏనుగును చూసి భయపడిన తండ్రి కుమారులు ఇద్దరు బైక్​ను అక్కడే వదిలేసి పరుగులు తీశారు.

ఈ సమయంలో విష్ణు(తండ్రి) వేగంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ, కుమారుడు(అర్జున్​) మాత్రం పరుగెత్తుతూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇక కింద పడి ఉన్న బాలుడిని ఏనుగు తన తొండంతో లేపి గట్టిగా నేలకేసి కొట్టింది. అనంతరం బాలుడిని తన పాదంతో గట్టిగా తొక్కి పట్టుకుంది. దీంతో అర్జున్​ అక్కడే మృతి చెందాడు. అయినా ఏనుగు కొద్దిసేపు అక్కడే నిలబడింది. అక్కడికి చేరుకున్న స్థానికులు ఏనుగును తరిమేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వెళ్లలేదు. చివరకు ఓ ట్రాక్టర్​ సాయంతో దాన్ని అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం స్థానికులు అర్జున్​ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అతడు అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

బంగాల్​లో ఈ నెల 23 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ఈ దారుణం జరిగింది. దాడి ఘటన తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన జరిగిన అరగంట తర్వాత అక్కడకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని బెలకోబా ఫారెస్ట్ రేంజ్​ అధికారి సంజయ్ దత్తా హామి ఇచ్చారు.

హెలికాప్టర్​ పంపిన దీదీ!
ఉత్తర బంగాల్​ పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏనుగు దాడిపై ఆరా తీశారు. బాలుడి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు మమత. ఈ క్రమంలో మృతుడి తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని తెలుసుకున్న సీఎం.. కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఆమెకు మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాకు తన హెలికాప్టర్‌ను పంపేందుకు ఆదేశిస్తానని ఆమె అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేదితో పాటు పలువురు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఉత్తర బంగాల్‌లో ఇలాంటి ఘటనలు జరగడానికి గల కారణం ఏనుగుల సంఖ్య అసాధారణంగా పెరగడమేనని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, ఇలాంటి ప్రాంతాల్లో బస్సులు నడపాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తు చేశారు. అవసరమైతే అడవికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖను కోరుతానని మమత చెప్పారు. బస్సులు నడిపితే విద్యార్థుల నడిచి బడులకు వెళ్లే పరిస్థితులు ఉండవని ఆమె అన్నారు. అయితే ఈ ఘటనకు నిరసనగా అక్కడ బంద్​కు పిలుపునివ్వడంపై మమతా గట్టిగా స్పందించారు. 11 ఏళ్ల క్రితమే ఈ బంద్​ పిలుపులకు స్వస్తి పలికామని ఆమె గుర్తు చేశారు. 'నా కాన్వాయ్​ వచ్చినా సరే ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే నేను ఊరుకోను. అలాంటిది ఎవరైనా ఇలాంటి చర్యలకు దిగితే నేను వెంటనే స్పందిస్తాను' అని మమతా స్పష్టం చేశారు. పది మంది నిరసనకారల కోసం వేలాది మంది ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలని మమతా ప్రశ్నించారు. ఇక, ఉత్తర బంగాల్​లో ఏనుగుల దాడులను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మమతా జాతీయ హరిత ట్రిబ్యునల్​ను ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details