ఇమాన్ హుస్సేన్.. బంగ్లాదేశీ టీనేజర్. భారత్-బంగ్లాదేశ్‌కు సరిహద్దుగా ఉండే షాల్డా నది సమీపంలోని ఓ గ్రామంలో ఉంటాడతడు. భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే ఇమాన్‌కు చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు వాటి కోసం త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్‌చౌరా గ్రామానికి వస్తుండేవాడు. ఈ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగేది కాదు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశ సరిహద్దు దాటడం కష్టమే అయినా.. చాక్లెట్ కోసం సాహసం చేసేవాడు ఇమాన్. ముందు షాల్డా నదిని ఈది, భారత్ వైపునకు వచ్చేవాడు. తర్వాత సరిహద్దు కంచెలో ఎక్కడైనా రంధ్రాలు ఉన్నాయేమో చూసుకుని.. జాగ్రత్తగా భారత్‌లోకి 'చొరబడేవాడు'. దగ్గర్లోని దుకాణంలో చాక్లెట్ కొనుక్కుని అదే దారిలో తిరిగి వెళ్లిపోయేవాడు.
ఇమాన్ హుస్సేన్ చాక్లెట్ యాత్రలు ఇప్పటివరకు బాగానే సాగాయి. ఏప్రిల్ 13న మాత్రం కథ అడ్డం తిరిగింది. అక్రమంగా బోర్డర్ దాటుతున్న ఇమాన్‌ను సరిహద్దు భద్రతా దళం పట్టుకుంది. సోనమురా పోలీసులకు అప్పగించింది. వారు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఇమాన్‌కు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
"బంగ్లాదేశ్ కోమిల్లా జిల్లాకు చెందిన బాలుడు చాక్లెట్ కొనుక్కునేందుకు భారత్‌లోకి చొరబడినట్లు విచారణలో అంగీకరించాడు. అతడి వద్ద 100 బంగ్లాదేశీ టాకాలు మాత్రమే ఉన్నాయి. చట్టవిరుద్ధమైన వస్తువులేవీ లేవు. సరైన పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించినందుకే ఇమాన్‌ను అరెస్టు చేశాం. విచారణ జరుగుతోంది. రిమాండ్ పూర్తయ్యాక అతడ్ని మళ్లీ కోర్టులో హాజరుపరచుతాం. అతడ్ని భవిష్యత్‌ను న్యాయస్థానమే నిర్ణయిస్తుంది." అని తెలిపారు సోనమురా పోలీసు అధికారి బనోజ్ బిప్లబ్ దాస్. మరోవైపు.. ఇమాన్ కుటుంబసభ్యులు ఎవరూ భారత అధికారుల్ని ఇంకా సంప్రదించలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అలా వచ్చిపోతుంటారు!: "కిరాణా సామగ్రి కొనుక్కునేందుకు, వివాహాలు వంటి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బంగ్లాదేశీలు ఇలా సరిహద్దు దాటి భారత్‌లోకి వస్తుంటారు. మానవతా కోణంలో బీఎస్ఎఫ్ వారిని పెద్దగా పట్టించుకోదు. స్మగ్లర్లపై మాత్రమే చర్యలు తీసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ బాలుడు చాక్లెట్ కొనుక్కునేందుకు వచ్చినవాడే" అని తెలిపారు కలామ్‌చౌరా వాసి ఇలియుస్ హుస్సేన్.
"సరిహద్దుల్లో కంచె వేసినా సోనమురా సబ్ డివిజన్లో అక్కడక్కడ ఖాళీలు ఉన్నాయి. కలామ్‌చౌరా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే కొన్ని ఇళ్ల మధ్యలో నుంచి సరిహద్దు గీత వెళ్తుంది. మరికొన్ని చోట్ల ఉపరితల సంక్లిష్టతల కారణంగా కంచె వేయడం కుదరలేదు. అందుకే ఈ పరిస్థితి" అని బీఎస్ఎఫ్ వర్గాలు వివరించాయి.