Borewell Rescued Girl Died :గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక జిల్లాలో 30 అడుగుల బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాయక బృందాలు అనేక గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారిని బయటకు తీసినా లాభం లేకుండా పోయింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం-జిల్లాలోని రాన్ గ్రామానికి చెందిన బాలిక ఏంజెల్ షఖ్రా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. అది గమనించిన గ్రామస్థులు చిన్నారి రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారులకు విషయాన్ని చేరవేశారు. సమచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి స్థానిక అధికారులు చేరుకున్నారు. బోర్వెల్లోకి ఆక్సిజన్‌ను పంపించారు.
ఆ తర్వాత చిన్నారిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగాయి. ఎల్ ఆకారంలోని హుక్తో బాలికను తాడుతో కట్టి 15 అడుగుల మేర పైకి తీసుకొచ్చారు. బోర్ బావికి సమాతరంగా తవ్వకాలు కూడా జరిపారు. అలా రాత్రి 9.50 గంటల ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే చికిత్స కోసం అంబులెన్స్‌లో జామ్ ఖంభాలియా పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు.