Booster dose in India: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందన్న భయాల నేపథ్యంలో కీలక సిఫార్సులు చేశారు భారత అగ్రశ్రేణి జినోమ్ శాస్త్రవేత్తలు. 40 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని సూచించారు. వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
ఈ మేరకు భారత సార్స్-కోవ్-2 జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియం(ఇన్సాకాగ్) వీక్లీ బులిటెన్‌లో ఈ సిఫార్సులు చేశారు శాస్త్రవేత్తలు.
"ఎట్ రిస్క్ జాబితాలో ఉండి ఇప్పటికీ టీకా తీసుకోనివారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలి. ముందుగా హై రిస్క్ ఉన్నవారికి ప్రాధాన్యం కల్పించాలి. ప్రస్తుత వ్యాక్సిన్ల యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను తటస్థం చేసేందుకు సరిపోవు. కానీ, తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా చేయగలవు. "
- జినోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో లోక్‌సభలో పలువురు సభ్యులు బూస్టర్ డోసుల పంపిణీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తల సిఫార్సులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త వేరియంట్‌ను తొలినాళ్లలోనే గుర్తించేందుకు జినోమ్ నిఘా కీలకమని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. అవసరమైన ప్రజా ఆరోగ్య చర్యలు చేపట్టాలని సూచించారు.