Booster Dose: కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి బారిన పడినవారికి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ వేయాలంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాశ్ షీల్ లేఖలు రాశారు. కొవిడ్ బారిన పడిన వారికి సాధారణ డోసులు సహా ప్రికాషన్ డోసు వేసే విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎవరైనా కొవిడ్ కారణంగా అనారోగ్యం పాలైతే కోలుకున్న నాటి నుంచి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ డోసు వేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది. టీకా కార్యక్రమానికి సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇచ్చిన సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు వెలువరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తన లేఖలో పేర్కొంది.