Corona dead bodies in Ganga: కరోనా 2.0 సమయంలో దేశం ఎదుర్కొన్న గడ్డుపరిస్థితులను భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఓవైపు చికిత్స కోసం ఆసుపత్రుల్లో పడకలు దొరకక ఇబ్బంది పడగా.. మరోవైపు కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ప్రజలు. ముఖ్యంగా గంగానదిలో మృతదేహాలు తేలడం ప్రజలను కలచివేసింది. గంగా నదికి, దేశానికి పట్టిన దీన స్థితితో కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు తాజాగా విడుదలైన ఓ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి.
'గంగా: రీఇమాజినింగ్, రిజువనేటింగ్, రీకనెక్టింగ్' పుస్తకాన్ని.. ఎన్‌ఎమ్‌సీజీ(నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ) డైరక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా రచించారు. కొవిడ్ రెండో దశ సమయంలో వైరస్‌తో మరణించిన దాదాపు 300మంది మృతదేహాలను గంగా నదిలో పడేసినట్టు ఆ పుస్తకంలో ఆయన వివరించారు.
"కరోనా చికిత్స కోసం అధికంగా ఖర్చుపెట్టిన ప్రజలకు, తమ వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు డబ్బులు సరిపోలేదు. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌లో వివిధ ఘాట్ల వద్ద గంగా నదిలో మృతదేహాలను పడేశారు. కన్నౌజ్‌లో ఈ తరహా ఘటనలు అధికంగా వెలుగుచూశాయి. అక్కడి నుంచి గంగా నది బిహార్‌కు ప్రవహిస్తుండగా.. అక్కడ కూడా మృతదేహాలు కూడా ఎప్పటికప్పుడు నీటిపై తేలుతూ దర్శనమిచ్చాయి. కొవిడ్ మృతదేహాలను ఎలా ఖననం చేయాలనే అంశంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రజలు అలా గంగా నదిలో మృతదేహాలను పడేశారు," అని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు మిశ్రా.