High court on sexual relationship: పెళ్లి పేరు చెప్పి తనతో లైంగిక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ముఖం చాటేసిన కేసులో ఓ వ్యక్తికి 25 ఏళ్ల తర్వాత బాంబే హైకోర్టులో ఊరట లభించింది. అతడితో లైంగిక సంబంధం పెట్టుకునేందుకు మహిళ నిరాకరించిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున సెక్షన్ 417 కింద నేరం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అసలేంటీ కేసు..?
Bombay high court: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహారాష్ట్ర పాల్గడ్కు చెందిన ఓ వ్యక్తి తనతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడని ఆరోపిస్తూ 1996లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పెళ్లికి అతడు నిరాకరించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఐపీసీ 376(అత్యాచారం),ఐపీసీ 417(మోసం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణ సమయంలో బాధిత మహిళ సహా ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. అందులో నిందితుడు తనకు తెలుసని బాధితురాలు అంగీకరించింది. తాను మూడేళ్లపాటు నిందితునితో లైంగిక సంబంధాన్ని కొనసాగించానని చెప్పింది. అంతేగాక వాళ్లిద్దరూ మూడేళ్లపాటు ప్రేమించుకున్నారని బాధితురాలి సోదరి కూడా తెలిపింది. మూడేళ్ల విచారణ తర్వాత.. ఈ కేసులో పాల్గఢ్ అదనపు న్యాయమూర్తి... నిందితునికి ఏడాది జైలు శిక్ష సహా రూ.5,000 జరిమానా విధించారు.