తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆత్మగౌరవం కోసం రాజీనామా చేస్తున్నా'.. కోర్టులోనే జడ్జి ప్రకటన.. ప్రొఫెసర్ సాయిబాబా సహా కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చి.. - బాంబే కోర్టు న్యాయమూర్తి రాజీనామా వార్తలు

Bombay High Court Judge Rohit Deo resignation : బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ దేవ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్లకు పైగా సర్వీసు ఉన్నప్పటికీ.. జడ్జి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. రాజీనామా చేస్తున్నట్లు కోర్టు గదిలోనే ప్రకటించారు.

Bombay High Court Judge Rohit Deo resignation
Bombay High Court Judge Rohit Deo resignation

By

Published : Aug 4, 2023, 4:04 PM IST

Bombay High Court Judge Rohit Deo resignation : బాంబే హైకోర్టు నాగ్​పుర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ దేవ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. న్యాయవాదుల సమక్షంలో కోర్టు గదిలోనే రాజీనామాపై ప్రకటన చేశారు. ఇందుకు గల కారణాలను ఆయన వివరించలేదు. అయితే, తన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనని న్యాయమూర్తి చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరినీ బాధపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోలేదని, కోర్టులో ఉన్నవారంతా తన కుటుంబ సభ్యుల్లాంటివారేనని జస్టిస్ రోహిత్ దేవ్ వెల్లడించినట్లు న్యాయస్థానంలో ఓ లాయర్ పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడాన్ని కొనసాగించాలని కోర్టులో ఉన్న న్యాయవాదులకు జస్టిస్ దేవ్ సూచించారు. కొన్ని సందర్భాల్లో తాను కఠినంగా వ్యవహరించానని, అందుకు క్షమించాలని కోరారు. ఆయన నిర్ణయంతో కోర్టు కార్యకలాపాలు వాయిదా పడ్డాయి.

బదిలీ వల్లే!
Justice Rohit Deo news in Telugu : జస్టిస్ రోహిత్ దేవ్ ఈ ప్రకటన చేయగానే.. కొందరు న్యాయవాదులు ఆయన ఛాంబర్​లోకి వెళ్లి మాట్లాడారు. ఆకస్మిక నిర్ణయానికి కారణాలపై ఆరా తీశారు. తనను బదిలీ చేస్తున్నారన్న సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని న్యాయమూర్తి చెప్పినట్లు తెలిసింది.

కీలక తీర్పుల్లో భాగం..
జస్టిస్ రోహిత్ దేవ్ ఇటీవల కీలక తీర్పుల్లో భాగమయ్యారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చింది ఆయనే. సాయిబాబాకు విధించిన జీవితఖైదును కొట్టేస్తూ జస్టిస్ రోహిత్ 2022 అక్టోబర్​లో తీర్పునిచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం సరైన నిబంధనలు పాటించకుండానే విచారణ జరిపారని తీర్పులో పేర్కొన్నారు. శిందే- ఫడణవీస్ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ధర్మాసనం దానిపై స్టే విధించింది. ఈ కేసుపై మళ్లీ వాదనలు వినాలని నాగ్​పుర్ బెంచ్​ను ఆదేశించింది.

మరోవైపు, నాగ్​పుర్- ముంబయి సమృద్ధి ఎక్స్​ప్రెస్ వే నిర్మాణ పనుల్లో భాగమైన కాంట్రాక్టర్లు.. అక్రమంగా ఖనిజాల మైనింగ్ చేపడుతున్నారన్న ఆరోపణలపై రెవెన్యూ శాఖ చేపట్టిన చర్యలను నిలిపివేసేలా మహారాష్ట్ర ప్రభుత్వం జనవరిలో తీసుకొచ్చిన తీర్మానంపై జస్టిస్ దేవ్ స్టే విధించారు.

రెండేళ్లకు పైగా సర్వీసు ఉన్నా..
హైకోర్టు జడ్జిగా పదవి చేపట్టక ముందు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వొకేట్ జనరల్​గా పని చేశారు. అదనపు సొలిసిటర్ జనరల్​గానూ సేవలందించారు. 2017లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం 2025 డిసెంబర్ 4 వరకు ఉంది. రెండేళ్లకు పైగా సర్వీసు ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details