మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను(Anil Deshmukh News) నవంబర్ 12వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగించింది బాంబే హైకోర్టు. ఇదే కేసుపై ముంబయిలోని ప్రత్యేక కోర్టు శనివారం ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది ధర్మాసనం.
అనిల్ దేశ్‌ముఖ్‌ను ఐదు రోజులపాటే విచారించామని, అందులో రెండు రోజులు సెలవులేనని హైకోర్టుకు సమర్పించిన దరఖాస్తులో ఈడీ పేర్కొంది. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు తమకు ఇంకొంత సమయం కావాలని స్పష్టం చేసింది. ఈడీ దరఖాస్తును విచారించిన జస్టిస్ మాధవ్ జామ్దర్.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సహజ న్యాయ నియమాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక కోర్టు తిరస్కరణతో..
నవంబరు 6న.. ఇదే కేసుపై విచారించిన ముంబయిలోని ప్రత్యేక కోర్టు.. దేశ్‌ముఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశ్‌ముఖ్‌ను విచారించేందుకు మరో 9 రోజులు రిమాండ్ కావాలని ఈడీ అధికారులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో.. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఈడీ అధికారులు.