Bombay HC judgement on Kissing: పెదాలపై ముద్దుపెట్టడం అసహజ లైంగిక నేరాల పరిధిలోకి రాదని బాంబే హైకోర్టు పేర్కొంది. శరీరాన్ని స్పృశించడం, పెదాలపై ముద్దాడటం వంటివి ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం లైంగిక దాడి కిందకు రావని అభిప్రాయపడింది. ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే..
14ఏళ్ల తన కుమారుడిపై లైంగిక దాడి చేశాడని ఓ వ్యక్తి గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోని కప్‌బోర్డులో ఉంచిన డబ్బులు సైతం పోయాయని తెలిపాడు. డబ్బులను నిందితుడికే ఇచ్చానని బాలుడు తన తండ్రితో చెప్పాడు. బాలుడు 'ఓలా పార్టీ' అనే ఆన్లైన్ గేమ్ అడుతుండేవాడు. ఈ గేమ్‌లో అప్గ్రేడ్ల కోసం రీఛార్జ్ చేయించుకునేందుకు నిందితుడి దుకాణానికి బాలుడు తరచూ వెళ్లేవాడు. ఓరోజు ఇలాగే రీఛార్జ్ కోసం వెళ్లగా.. నిందితుడు బాలుడి పెదాలపై ముద్దు పెట్టాడు. రహస్య భాగాలను తాకాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో సహా పలు సెక్షన్ల కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 377(అసహజ లైంగిక నేరం)ను సైతం ఎఫ్ఐఆర్లో జోడించారు. ఈ సెక్షన్ నిరూపితమైతే నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. బెయిల్ లభించడం కూడా కష్టమే.