Professor Saibaba : దిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబా నిర్దోషని.. ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. తనకు జీవిత ఖైదు విధిస్తూ 2017లో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సాయిబాబా బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన ధర్మాసనం.. సాయిబాబా నిర్దోషని తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. ఈ ఐదుగురిలో ఒకరు.. అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. వీళ్లంతా వేరే కేసులో లేకుంటే వాళ్లను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
సుప్రీంను ఆశ్రయించిన ఎన్ఐఏ
మరోవైపు మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఎన్ఐఏ ఈ నిర్ణయం తీసుకుంది.
దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2017 మార్చిలో ఉపా చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మావోయిస్టు సంబంధాలతో దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే కార్యకలాపాలకు వీరు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ఉపాతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద సాయిబాబా, ఇతరులను కోర్టు దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. సాయిబాబాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో ఉంచారు. మొదట అరెస్టయిన ఐదుగురు నిందితులపై 2014లో, సాయిబాబాపై 2015లో ఉపా కింద విచారించేందుకు అనుమతి లభించింది.