కర్ణాటక బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. స్కూల్లో బాంబు ఉందని ఓ విద్యార్థి మెసేజ్ పంపాడు. ఈ ఘటనలో ఐపీ అడ్రస్ ఆధారంగా ఆకతాయి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని రాష్ట్ర జువైనల్ జస్టిస్ బోర్డుకు అప్పగించారు.
సెలవులు ఇస్తారని స్కూల్‌కు బాంబు బెదిరింపులు.. ఆకతాయి విద్యార్థి అరెస్ట్ - కర్ణాటక బెంగళూరు లేటెస్ట్ న్యూస్
కర్ణాటకలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పాఠశాలలో బాంబు ఉందని పాఠశాలకు మెయిల్ చేశాడు ఓ విద్యార్థి. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బసవేశ్వర్ నగర్‌లోని నేషనల్ పబ్లిక్ స్కూల్‌కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే పాఠశాల యజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పాఠశాలకు చేరుకున్న పోలీసులు దాదాపు 1,000 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకింత భయం మొదలైంది. పాఠశాల చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.
బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు పాఠశాల ఆవరణ అంతా తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు పోలీసులకు లభించలేదు. దీంతో ఇది ఆకతాయిల పనేనని పోలీసులు అనుమానించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆకతాయి విద్యార్థిని గుర్తించారు. స్కూల్‌కు సెలవు వస్తే సరదాగా గడపవచ్చని ఇలా చేశానని పోలీసులకు తెలిపాడు. గూగుల్‌లో సెర్చ్ చేసి స్కూల్ అధికారిక మెయిల్‌కు మెసేజ్ పెట్టినట్లు విద్యార్థి పోలీసులు ఎదుట అంగీకరించాడు.