బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఓ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని ఓ సీటు కింద టిష్యూ పేపర్ దొరికిందని, అందులోనే బాంబు సందేశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వెంటనే పరిశీలన చేపట్టగా.. విమానంలో బాంబు లేదని తేలింది. అది నకిలీ బెదిరింపు సందేశమనేనని నిర్ధరణ అయింది.
ఇండిగో విమానంలో 'టిష్యూ పేపర్ బాంబ్'.. సిబ్బంది హైఅలర్ట్.. చివరకు.. - టిష్యూ పేపర్ బాంబ్
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు గురించి ప్రస్తావిస్తూ ఓ టిష్యూ పేపర్‌ను విమానంలో వదిలేశాడు ఓ దుండగుడు. దీంతో సిబ్బంది ఆందోళన చెందారు.
మరిన్ని వివరాలిలా..
ఇండిగోకు చెందిన '6ఈ 379' విమానం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 5.29 గంటలకు బయల్దేరింది. దేవనహళ్లి కెంపెగౌడ విమానాశ్రయంలో అదేరోజు ఉదయం 8.10 గంటలకు ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే విమానంలో బాంబు పెట్టినట్లు ఓ సందేశాన్ని ఇండిగో సిబ్బంది గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
గుర్తుతెలియని వ్యక్తులు టిష్యూ పేపర్‌ను వదిలేసి వెళ్లినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. టిష్యూపై బ్లూ కలర్లో అక్షరాలు ఉన్నాయని తెలిపాయి. విమానంలోని 6డీ సీటు వద్ద టిష్యూ పేపర్ కనిపించిందని వివరించాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగి.. విమానాన్నంతా జల్లెడ పట్టాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువుల గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదు. దీంతో ఆ సందేశం నకిలీది అని నిర్ధరణకు వచ్చారు. ఈ ఘటనపై కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.