పంజాబ్‌లో టిఫిన్ బాక్స్ బాంబుల వ్యవహారం కలకలం రేపుతోంది. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో ఈ తరహా ఘటనలు పెరుగుతుండటం వల్ల జాతీయ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని ఫిరోజ్‌పుర్ జిల్లాలో టిఫిన్ బాక్స్ బాంబు బయటపడటం రాజకీయ దుమారానికి దారితీసింది.
అసలేం జరిగింది?
దీపావళికి ఒక్క రోజుముందు, అంటే బుధవారం భారత్- పాకిస్థాన్ సరిహద్దులోని ఫిరోజ్పుర్లో టిఫిన్ బాక్స్ బాంబు బయటపడింది. అలి కే గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో దీనిని పోలీసులు గుర్తించారు. తొలుత.. జలాలాబాద్ పేలుళ్ల కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల నుంచి ఓ టిఫిన్ బాక్స్ బాంబు, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిని విచారించగా.. మరో టిఫిన్ బాక్సు బాంబు.. అలి కే గ్రామంలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడి వెళ్లి దానిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇది కొత్త కాదు!
సెప్టెంబర్‌లో జలాలాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమృత్సర్, కపూర్తలా, ఫాజిల్కా, తర్న్ తరన్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి టిఫిన్ బాక్స్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు.