ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అక్టోబరు 25, 27 తేదీల్లో హరిద్వార్, రిషికేశ్‌లలో బాంబు దాడులకు పాల్పడతామని జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థ లేఖ రాసింది. హరిద్వార్ రైల్వే పోలీసులకు ఈ లేఖ పంపింది. అక్టోబర్ 10న వచ్చిన బెదిరింపు లేఖను పోలీసు శాఖ గోప్యంగా ఉంచగా.. హరిద్వార్ రైల్వే పోలీసులు లేఖ పంపిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత పదేళ్లుగా బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖలు హరిద్వార్ రైల్వే పోలీసులకు వస్తున్నాయి. అయితే పండగ సమయంలో ఇలా ఎప్పుడూ బెదిరింపు లేఖలు రాలేదు. అక్టోబర్ 25న హరిద్వార్, రిషికేశ్.. అక్టోబర్ 27న చార్‌ధామ్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామని ఉగ్రసంస్థ జైషే మహ్మద్ లేఖలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు హరిద్వార్, రిషికేశ్, చార్ధామ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. దీంతో పాటు హరిద్వార్ రైల్వే స్టేషన్ ఆవరణలో భద్రతను మరింత పెంచారు.