రైతుల ఆందోళనపై విదేశీ ప్రముఖులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ సహా ఇతర తారలు పిలుపునిచ్చిన తర్వాత బాలీవుడ్లో ట్విట్టర్ వార్ మొదలైంది. పాప్ సింగర్ రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ రైతులకు మద్దతుగా చేసిన ట్వీట్లకు ప్రతిస్పందనగా.. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ సహా పలువురు సినీ, క్రీడా ప్రముఖులు చేసిన ట్వీట్లపై ఇప్పుడు దుమారం రేగుతోంది.
వీరంతా ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతున్నారని.. నటి తాప్సీ, సినీ నిర్మాత ఒనిర్, నటుడు అర్జున్ మాథుర్ సహా పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు.
రైతులకు మద్దతుగా నిలిచిన నటి తాప్సీ 'ఒక ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే, ఒక జోక్ మీ నమ్మకాన్ని లేదా ఒక షో మీ మత విశ్వాసాన్ని దెబ్బతీస్తే.. మీ విలువల వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కానీ ఇతరులకు ప్రచార గురువులుగా మారకూడదు.' అని ట్వీట్ చేసింది.
అక్షయ్ కుమార్ సరసన పలు సినిమాల్లో నటించిన.. నటి సోనాక్షీ సిన్హా కూడా రిహానా ట్వీట్‌కు మద్దతు తెలిపారు. ఈ విషయంపై తన ఇన్‌స్టా స్టోరీలో పలు విషయాలను పంచుకున్నారు. రైతుల అంశం భారత అంతర్గతమనే వాదననూ ఆమె తోసిపుచ్చారు. 'వీళ్లంతా గ్రహాంతర వాసులు కాదు.. సాటి మనుషులకోసం మాట్లాడుతున్న వాళ్లు' అని పేర్కొన్నారు.