Mira road Manoj Sane : మహారాష్ట్ర ఠాణెలో సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భాగస్వామిని చంపిన నిందితుడు.. శరీర భాగాలను ముక్కలుగా నరికి ప్రెజర్ కుక్కర్లో ఉడికించాడని గురువారం పోలీసులు వెల్లడించారు. కొన్ని శరీర భాగాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసినట్లు సమాచారం. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గతకొద్ది రోజులుగా నిందితుడు కుక్కలకు బాగా ఆహారం పెడుతున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో శునకాలకు శరీర భాగాలనే పెట్టాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
మృతురాలు సరస్వతి వైద్య (36), నిందితుడు మనోజ్ సహానీ (56) సహజీవనం చేస్తూ ఠాణెలోని మీరా రోడ్ అపార్ట్మెంట్లో గత మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగింటివారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌కు వచ్చి పరిశీలించిన పోలీసులకు.. గదిలో మృతదేహం లభించింది. దీంతో సరస్వతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్కలు ముక్కలుగా నరికిన శరీర భాగాలు.. బకెట్లలో కనిపించాయని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Body parts boiled in cooker : సహానీ బెడ్రూమ్లో భారీ ప్లాస్టిక్ బ్యాగులు, రక్తపు మడుగులో ఉన్న చెట్లు నరికే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్‌తో పాటు గిన్నెల్లో శరీర భాగాలను ఉడకబెట్టినట్లు గుర్తించారు. ఇంకొన్ని శరీర భాగాలను మిక్సీలో వేసినట్లు తెలిపారు. మహిళ వెంట్రుకలు, సగం కాలిన ఎముకలు, శరీర భాగాలు కిచెన్ సింక్‌లో, బకెట్లలో కనిపించాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానం జూన్ 16 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.
అయితే, గతకొద్దిరోజుల నుంచి మనోజ్ సహానీ.. శునకాలకు ఆహారం పెడుతున్నాడని స్థానికులు పోలీసులతో చెప్పారు. గతంలో ఎన్నడూ కుక్కలకు ఒక్క బిస్కెట్ కూడా వేయని సహానీ.. రోజూ ఆహారం పెట్టడం ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపారు. అయితే, మృతురాలి శరీర భాగాలనే శునకాలకు వేశాడా అన్నది తెలియలేదని పోలీసులు వెల్లడించారు. శరీర భాగాలను బయటపడేసేందుకు అనేక సార్లు బయటకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి.. కుక్కలను మచ్చిక చేసుకునేందుకు ఆహారం ఇచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సరస్వతిని చంపడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని నయానగర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి నిందితుడిపై హత్య, ఆధారాల ధ్వంసం సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.