ఝార్ఖండ్ లాతేహార్ జిల్లాలో హృదయం చలించే ఘటన జరిగింది. ఓ గిరిజనుడి మృతదేహన్ని అతని కుటుంబ సభ్యులు రిక్షాపై ఇంటికి తీసుకుని వెళ్లారు. గురువారం రాత్రి రోడ్డుపై మృతదేహన్ని చక్రాల బండిపై తరలించడం చూసేవారిని కలచివేసింది.
ఓవైపు పుట్టెడు దుఃఖం.. మరోవైపు పేదరికం.. తోపుడు బండిపైనే ఇంటికి మృతదేహం - గిరిజనుడి మృతదేహం తోపుడు బండిపై తరలింపు
మృతదేహన్ని రిక్షాపై తరలించిన ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్ సమకూర్చేందుకు నిరాకరించగా, స్వయంగా వాహనం ఏర్పాటు చేసుకునే స్తోమత లేని కుటుంబ సభ్యులు ఇలా ప్లాట్‌ఫాం రిక్షాపై మృతదేహన్ని తీసుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే.. నది పర్బలుమత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసియా పంచాయితీకి చెందిన చంద్రు లోహ్రా అనే ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆరోగ్యం పాడుచేసుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు బాలుమత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. చికిత్స పొందుతూ చంద్రు ఆసుపత్రిలోనే మృతి చెందాడు. మృతదేహన్ని తరలించేందుకు ఆసుపత్రి యాజమాన్యాన్ని అంబులెన్స్‌ను అడిగారు కుటుంబ సభ్యులు. ఇందుకు యాజమాన్యం నిరాకరించింది. స్వయంగా అంబులెన్స్‌ను సమకూర్చుకునే స్తోమత లేని ఆ కుటుంబం ఇలా తోపుడు బండిపై మృతదేహన్ని తీసుకెళ్లింది. ఆసుపత్రి ఆవరణలో అంబులెన్స్ ఉన్నా యాజమాన్యం తమకు ఎలాంటి సాయం అందించలేదని మృతుడి బంధువులు వాపోయారు.