yamuna boat tragedy యమునా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలో 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తాజాగా 8 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు.
మర్కా నుంచి ఫతేపుర్‌లో ఉన్న జరౌలీ ఘాట్‌కు యమునా నది మీదుగా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది. పడవలో రాఖీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బందితో సహాయక చర్యలు వేగవంతం చేశారు. అదనపు ఎస్పీ లక్ష్మీ నివాస్ మిశ్రా మాట్లాడుతూ.. ఏడెనిమిది మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చేశారని.. మిగతా వారంతా మునిగిపోయారన్నారు.