నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పర్యాటక శాఖ బోటు బోల్తా.. ఇద్దరు మృతి - అవుకు రిజర్వాయర్ వార్తలు
12:27 May 14
మరో పర్యటకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన గజ ఈతగాళ్లు
Boat capsized in Avuku Reservoir: నంద్యాల జిల్లాలోని అవుకు జలాశయంలో విషాదం చోటుచేసుకుంది. పర్యాటక శాఖ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. విహారయాత్ర.. కాస్త విషాదయాత్రగా మారింది. అప్పటి వరకు కేరింతలతో ఉత్సాహంగా గడిపిన వాళ్లంతా.. బోటు ప్రమాదానికి గురికావడంతో నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలతో బయటపడగా.. ఒకరు ఘటన ప్రదేశంలో మృతిచెందారు. మరోకరిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో మహిళ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
నంద్యాల జిల్లాలో పర్యాటక శాఖ బోటు ప్రమాదం విషాదంగా మారింది.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోవెలకుంట్ల ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ రసూల్ కుటుంబ సభ్యులు, బంధువులు 12 మంది అవుకు జలాశయానికి వచ్చారు. కొంత సమయం బోట్ లో షికార్ చేశారు. అనంతరం తిరిగి వచ్చే సమయంలో బోటు బోల్తా పడటంతో... 12 మంది ఒక్కసారిగా జలాశయంలో మునిగిపోయారు. వీరిలో 10 మందిని స్థానికులు బయటకు తీశారు. వీరిలో కోవెలకుంట్లకు చెందిన ఆశాబీ(28) మృతి చెందారు. మరొకరు గల్లంతు అయ్యారు. ముగ్గురు అస్వస్థతకు గురి కావడంతో బనగానపల్లి ఆసుపత్రికి తరలించారు. వీరిలో నంద్యాలకు చెందిన నూర్జహాన్(35) చికిత్స పొందుతూ మృతి చెందారు. చస్విన్, హనీలను మెరుగైన వైద్యం కోసం బనగానపల్లి ఆసుపత్రి నుంచి నంద్యాలకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. బోటులోకి ఒక్కసారిగా నీరు రావడంతో బోల్తా పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. గల్లంతైన సాజిదా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.