అంధుడి సాహసం.. 7,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! మన రోజువారీ జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని చూసి కొందరు నిరుత్సాహపడతారు. మరికొందరు.. అనుకున్న పనిని మధ్యలోనే ఆపేసి, కారణాలను వెతుక్కుంటారు. కానీ ఆత్మస్థైర్యం ఉంటే చాలు.. ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని నిరూపిస్తున్నాడు ముంబయికి చెందిన ఓ అంధుడు. వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా సాహస యాత్ర చేపట్టాడు 25ఏళ్ల అజయ్ లల్వాణీ. మనలోని నెగిటివ్ అంశాన్ని కూడా పాజిటివ్‌గా మలుచుకోవచ్చని చాటిచెబుతూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
అజయ్ సైకిల్ యాత్రకు పెద్ద ప్రణాళికే ఉంది. ముంబయిలో మొదలైన అజయ్ యాత్ర.. శ్రీనగర్‌ను చుట్టి.. కన్యాకుమారికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ముంబయికి తిరుగుపయనమవుతాడు అజయ్. మొత్తం మీద ఈ 7,500కిలోమీటర్ల యాత్ర 45 రోజులు సాగనుంది.
అంధుడైన అజయ్‌కు సాయం చేసేందుకు 18సభ్యుల బృందం అతడితో వెళ్లింది. అజయ్ ప్రయాణించే సమయంలో అతడి ముందు ఓ వాహనం, వెనక ఓ వాహనం ఉంటుంది. బృంద సభ్యులు వాకీటాకీతో అజయ్‌కు మార్గనిర్దేశం చేస్తారు.
ముంబయి టు కశ్మీర్ సైకిల్ యాత్ర
అజయ్ సైకిల్ యాత్ర.. మంగళవారం గుజరాత్‌లోని నవసారికి చేరింది. అయితే తన సాహసం వెనక ఓ బలమైన కారణం ఉందంటున్నాడు అతడు.
"నేను 100శాతం అంధుడిని. నేను ఈ సాహసం చేయడం వెనక ఓ బలమైన కారణం ఉంది. అంధుల గురించి సమాజంలో ఎవరికీ సరైన అవగాహన లేదు. కానీ మా గురించి అందరూ తెలుసుకోవాలి. అదే సమయంలో రోడ్డు భద్రత కూడా ఎంతో ముఖ్యం. నేను ఈరోజు రోడ్డు మీద సైకిల్‌పై వెళుతుంటే, చాలా ప్రాంతాల్లో లైట్లు కూడా లేవు. నాకు చూపు లేకపోయినా, చాలా మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. స్ట్రిట్ లైట్లు లేకపోవడం ఇందుకు ఓ కారణం. మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రోడ్లు ఇప్పటికీ దారుణంగా ఉన్నాయి. నేను 7,500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టాను. కానీ ముంబయి నుంచి యాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయి."
-- అజయ్ లల్వాణీ, సైక్లిస్ట్.
అజయ్‌కు సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. సైక్లింగ్‌తో పాటు అతడు ఓ మంచి స్పోర్ట్స్‌మెన్. రాక్ క్లైంబింగ్, స్విమ్మింగ్‌లో దిట్ట. అజయ్ ఓ పర్వతారోహకుడు కూడా. 17వేలు, 20వేల అడుగుల ఎత్తున్న హిమాలయ పర్వతాలను ఇప్పటికే అధిరోహించేశాడు. తన నెక్ట్స్ టార్గెట్ మౌంట్ ఎవరెస్ట్ అని, రెండేళ్లల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు అజయ్.
ఇవీ చూడండి:-