Blind Man Farming :ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి తమిళనాడు తిరునెల్వెలి జిల్లాకు చెందిన మురుగేశన్. చిన్నతనంలోనే రెండు కళ్లు కోల్పోయిన అతడు.. దృఢ సంకల్పంతో వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంధత్వాన్ని సైతం లెక్కచేయకుండా దట్టమైన పశ్చిమ కనుమల్లో.. పులులు, చిరుతుల సంచారం మధ్యలోనే సేద్యం చేస్తున్నాడు.
చిన్నతనంలో అనారోగ్యానికి గురైన మురుగేశన్.. సరైన వైద్యం అందకపోవడం వల్ల రెండు కళ్లను కోల్పోయాడు. మరోవైపు.. తండ్రి సైతం మురుగేశన్, అతడి తల్లిని వదిలేసి వెళ్లి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో తల్లే మురుగేశన్ బాగోగులు చూస్తూ వచ్చింది. ఈ క్రమంలో చిన్నతనంలో సరదాగా తల్లికి తోడుగా పొలానికి వెళ్లిన మురుగేశన్కు.. తర్వాత అదే ఆసక్తిగా మారింది. దీంతో తనకున్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
కళ్లు ఉన్న వ్యక్తులు చేసే పనులన్నీ ఎలాంటి తడబాటు లేకుండా సులభంగా చేసేస్తున్నాడు మురుగేశన్. విత్తనాలు నాటడం, కలుపు తీయడం నుంచి పంట కోసే వరకు అన్ని పనులు సులువుగా చేసేస్తున్నాడు. అంతేకాదు అడవి పందులు, జింకలు లాంటి వన్య ప్రాణుల నుంచి తన పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టూ కంచెను సైతం వేశాడు. పండించిన పంటను సైతం తానే మార్కెట్కు తీసుకెళ్లి విక్రయించి వస్తాడు. మురుగేశన్ అరటితో పాటు దుంపలను సాగు చేస్తున్నాడు. వీటిని ఎక్కువగా చిప్స్ తయారీలో వినియోగిస్తారు.
"నాకు చిన్నప్పటి నుంచే కళ్లు కనిపించవు. 3 ఏళ్లు వయసులో కళ్లు పోయాయని మా అమ్మ చెప్పింది. అప్పటి నుంచి ఇలానే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి మా అమ్మతో కలిసి వ్యవసాయం చేయడం నాకు అలవాటు. అప్పటి నుంచి నాకు దీనిపై ఆసక్తి కలిగింది. ఇప్పుడు నేను వివిధ రకాల దుంపలను పండిస్తాను. ఇప్పుడు అదే నా లోకం."