'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అన్న వ్యాఖ్యాన్ని నిజం చేసింది ఓ దివ్యాంగురాలు. పక్కవారి సహాయం లేకపోతే కనీసం అడుగు కూడా వేయలేదు. కానీ తన పట్టుదల, సంకల్పంతో.. అక్షరాలను అందిపుచ్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగింది. అంగవైకల్యాన్ని అధిగమించిన ఆ అమ్మాయి.. జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో 99.31 శాతం సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
బంగాల్ నదియాలోని శాంతిపుర్కు చెందిన పియాషా మహల్దార్ అనే అమ్మాయి పుట్టుకతోనే దివ్యాంగురాలు. కేవలం 3 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. బాల్యం నుంచి తనంతట తానుగా కదలలేని పరిస్థితి. అయినా సరే పియాషాకు చదువంటే చాలా ఆసక్తి. అదే ఇప్పుడు ఆమెను ఈ విజయం సాధించేలా చేసింది. స్కూల్, కాలేజీలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. సెప్టెంబర్ 23న యూజీసీ నిర్వహించిన జాతీయ అర్హతా పరీక్షను కళ్యాణి పరీక్షా కేంద్రంలో రాసింది. నెట్ పరీక్ష సైతం.. కంప్యూటర్ ముందు బోర్లా పడుకుని రాసింది. సోమవారం ఫలితాలు వెలవడగా.. బెంగాలీ విభాగంలో 99.31 శాతం స్కోర్ సాధించింది పియాషా.