Boiler blast in Muzaffarpur Bihar: బిహార్ ముజఫర్పుర్లోని నూడిల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించగా.. ఏడుగురు మరణించారు. బేలా పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
" నూడిల్స్ పరిశ్రమలోని బాయిలర్ పేలిపోయింది. దీంతో సమీపంలోని భవనాల గోడలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఎస్కేఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించాం. పేలుడుపై దర్యాప్తు జరుగుతోంది."
- ప్రణవ్ కుమార్, డీఎం, ముజఫర్పుర్.
బాయిలర్ పేలిన సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సుమారు 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు చెప్పారు. పరిశ్రమలోని ఓ మిల్లు, భవనం సైతం ధ్వంసమైనట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఆ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల కుటుంబాలకు పరిహారం
నూడిల్స్ పరిశ్రమలో బాయిలర్ పేలి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఈ మొత్తం అందనుంది.
క్షతగాత్రులకు రూ. 50 వేలు ప్రకటించారు.
ఇదీ చూడండి:పోలీసులపై 300మంది వలస కార్మికుల దాడి!