భాజపా స్టార్ క్యాంపెయినర్లు, అలనాటి హీరోయిన్లు ఖుష్బూ సుందర్, గౌతమిలకు కాలం కలిసిరావడంలేదు. 1980లలో తమిళ సినీ పరిశ్రమను ఊపుఊపిన వీరు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల ద్వారా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన వీరి ఆశలు అడియాసలయ్యేలా ఉన్నాయి.
రాజపాలయంలో గౌతమి, చెపాక్-ట్రిప్లికేన్ నియోజక వర్గంలో ఖుష్బూ నాలుగు నెలలుగా శాసనపోరు కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు భాజపా ముఖచిత్రాలుగా మారారు.
అయితే ఏఐఏడీఎంకే సహా ఇతర కూటమి పార్టీలు ఇటీవల చేసుకున్న సీట్ల సర్దుబాటుతో వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. కూటమిలో అతిపెద్ద పార్టీ ఏఐఏడీఎంకే.. భాజపాకు ఆ రెండు నియోజకవర్గాలను కేటాయించలేదు. ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఈ కూటమిలో పీఎంకే, భాజపాతో పాటు ఇతర పార్టీలున్నాయి.
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో ఏఐఏడీఎంకే 177 స్థానాల్లో పోటీ చేయనుంది. భాజపా 20, పీఎంకే 23 చోట్ల నుంచి బరిలో నిలవనున్నాయి. ఈ ఒప్పందంతో ఆశ్చర్యపోవడం ఖుష్బూ, గౌతమిల వంతైంది.
2011లో శివకాశి నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ.. ఈ ఎన్నికల్లో రాజపాలయం నుంచి పోటీ చేయనున్నారు. చెపాక్-ట్రిప్లికేన్ నుంచి పీఎంకేకు చెందిన ఏవీఏ కస్సలి బరిలో నిలుస్తున్నారు.
ఖుష్బూ శ్రమ వృథా?
కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ను వీడి కాషాయ కండువా కప్పుకొన్న ఖుష్బూను చెపాక్ నియోజక వర్గానికి ఇన్ఛార్జ్గా నియమించింది భాజపా. ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి వెళ్తానని ఆశించి.. దాదాపు మూడు నెలలు తీవ్రంగా కృషిచేశారామె. పార్టీ సమావేశాలకు హాజరవడమే కాక ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆ స్థానం నుంచే గతంలో మూడు సార్లు గెలుపొందారు.
1977 నుంచి డీఎంకేకు చెపాక్ కంచుకోటలా ఉంది. దానికి చరమగీతం పాడాలని ఖుష్బూ భీష్మించుకున్నారు. వారసత్వ పాలనను అంతమొందించాలని తన ప్రచారంలో పిలునిచ్చారు.
వ్యర్థమైన గౌతమి పోరు?
గౌతిమి కూడా రాజపాలయం నుంచి పోటీ చేస్తానని భావించి అక్కడి ప్రజలను తరచూ కలిసేవారు. దాదాపు 5 నెలలుగా ఆ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి డీఎంకేపై విమర్శల దాడి చేశారు. దీంతో గౌతమికి అక్కడ మంచి ఆదరణ లభించింది.
అయితే ఈ రెండు నియోజకవర్గాలను ఇప్పుడు ఇతర పార్టీలకు కేటాయించడం వల్ల వీరికి నిరాశే మిగిలింది. కాగా, ఈ 5 నెలలు తనపై ప్రేమ, ఆదరణ చూపిన రాజపాలయం నియోజకవర్గ ప్రజలకు గౌతమి కృతజ్ఞతలు తెలిపారు.