గుజరాత్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా హవా చాటింది. జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, తాలుకా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భారీ విజయం అందించారు. మొత్తం 31జిల్లా పంచాయతీలు ఉండగా, అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే తరహాలో ఫలితాలు పునరావృతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. భాజపా ప్రభుత్వ సుపరిపాలనకు ఈ ఫలితాలే నిదర్శనమంటూ ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 31 జిల్లా పంచాయతీలు, 81 మున్సిపాలిటీలు, 231 తాలుకా పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. 81 మున్సిపాలిటీలకు గానూ భాజపా 74 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. 31 జిల్లా పంచాయతీల్లో 980 స్థానాలు ఉండగా వీటిలో 742 స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్ కేవలం 137 చోట్లకే పరిమితమైపోయింది. ఇక 231 తాలూకా పంచాయతీల్లో 196 చోట్ల కమలం పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 4 మున్సిపాలిటీలు, 33 తాలుకా పంచయతీల్లో మాత్రమే విజయం సాధించింది.
ఆప్ 42
ఇక తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 42 స్థానాల్లో విజయం సాధించారు. తాలూకాల్లో 31 చోట్ల, జిల్లా పంచాయతీల్లో 2 చోట్ల, మున్సిపాలిటీల్లో 9 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్రులు 286 స్థానాల్లోనూ విజయం సాధించారు.