రాజస్థాన్‌లో 'జన్ ఆక్రోశ్ యాత్ర'పై భారతీయ జనతా పార్టీ యూటర్న్ తీసుకుంది. చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. కొవిడ్ నిబంధనలను అనుసరించి యాత్రను షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నట్లు భాజపా వెల్లడించింది.
'రద్దు లేదు.. కొవిడ్ నిబంధనలతో కొనసాగిస్తాం'.. 'జన్ ఆక్రోశ్ యాత్ర'పై భాజపా యూటర్న్ - రాజస్థాన్‌లో భాజపా జన్ ఆక్రోశ్ యాత్ర
కరోనా ఆందోళనల వేళ.. రాజస్థాన్‌లో జన్ ఆక్రోశ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భారతీయ జనతా పార్టీ గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. కొవిడ్ నిబంధనలతో యాత్రను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిసెంబరు 1న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ యాత్రను ప్రారంభించారు. రైతుల, పాలనా పరమైన సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 'జన్ ఆక్రోశ్' పేరుతో సభలు నిర్వహిస్తోంది. తాజాగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ యాత్రను రద్దు చేసుకుంటున్నట్లు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం ప్రకటించారు. "భాజపాకు ప్రజలే ఫస్ట్.. ఆ తర్వాతే రాజకీయాలు. ప్రజల భద్రత, వారి ఆరోగ్యమే మా ప్రాధాన్యం" అని తెలిపారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా మాట్లాడుతూ యాత్రను రద్దు చేయట్లేదని వెల్లడించడం గమనార్హం. "ఇప్పటి వరకు 41 అసెంబ్లీ నియోజక వర్గాల్లో జన్‌ఆక్రోశ్ సభలను నిర్వహించాం. అయితే, కరోనా నేపథ్యంలో దీనిపై ముందు కొంత గందరగోళం నెలకొంది. కానీ, యాత్ర రద్దు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి అడ్వైజరీ రాలేదు. అందుకే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జన్ ఆక్రోశ్ సభలను నిర్వహించనున్నాం. ఈ సభల్లో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్వైజరీలు వచ్చేవరకు యాత్ర కొనసాగుతుంది"అని ఆయన తెలిపారు.
కొవిడ్ వ్యాప్తి సమయంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర'పై ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ యాత్రలో కరోనా కేసులు పెరిగే అవకాశముందని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల రాహుల్‌కు లేఖ రాశారు. యాత్రలో కొవిడ్ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. దీనిపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా చేపడుతున్న ర్యాలీపై కాషాయ పార్టీ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.