కేంద్రంలోని అధికార భాజపా సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. భాజపా ఆదాయం 50 శాతం(BJP Income growth) పెరగడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'భాజపా ఆదాయం 50 శాతం వృద్ధి చెందింది, మరి మీ ఆదాయం ఎంతమేర పెరిగింది' అని దేశప్రజలను ప్రశ్నించారు.
'భాజపా రాబడి 50 శాతం పెరిగింది. మరి మీ ఆదాయం ఎంత పెరిగింది?'
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఏడీఆర్ నివేదిక
జాతీయ పార్టీల ఆదాయ, వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్(ఏడీఆర్)సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భాజపాకు రూ.2,410.09 కోట్ల ఆదాయం సమకూరగా, 2019-20లో ఏకంగా 50.34 శాతం అధికంగా రూ.3,623.28 కోట్లు(Electoral bonds Bjp) వచ్చింది.
అదే సమయంలో కాంగ్రెస్ ఆదాయం 25.69 శాతం తగ్గిపోయింది. 2018-19లో ఆ పార్టీకి రూ.918.03 కోట్లు ఆదాయం రాగా, మరుసటి ఆర్థిక సంవత్సరంలో రూ.682.21 కోట్లు మాత్రమే వచ్చాయి. శాతాల వారీగా చూస్తే ఆదాయ పెరుగుదలలో మరో జాతీయ పార్టీ ఎన్సీపీ మొదటి స్థానంలో ఉంది. 2018-19లో ఆ పార్టీకి రూ.50.71 కోట్లు సమకూరగా 2019-20లో 68.77 శాతం అధికంగా రూ.85.583 కోట్లు వచ్చింది.
ఇదీ చదవండి:కమలం పార్టీకి కాసుల పంట- ఆదాయం 50% వృద్ధి!