రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో భాజపా కేంద్ర బిందువుగా ఉంటుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు భాజపాను తక్షణమే తరిమికొడతారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భావిస్తున్నారని.. కానీ అది ఇప్పట్లో జరగదని జోస్యం చెప్పారు. ఈ మేరకు గోవాలో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో 'పీకే' ప్రసంగించిన వీడియో వైరల్‌గా మారింది. 'ఒకవేళ కేంద్రంలో మోదీ దిగిపోయినప్పటికీ భాజపా ఎక్కడికీ వెళ్లదు. రాబోయే దశాబ్దాల్లో ఆ పార్టీతో కాంగ్రెస్ పోరాడాల్సిందే' అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోసం ప్రస్తుతం వ్యూహాలు రచిస్తున్నారు పీకే.
"భారత రాజకీయాల్లో భాజపా కేంద్ర బిందువుగా మారబోతోంది. గెలిచినా, ఓడినా స్వాతంత్య్రం వచ్చిన తొలి 40 ఏళ్లలో కాంగ్రెస్ ఎలాగైతే ఉందో.. భాజపా సైతం ఎక్కడికీ వెళ్లదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 30 శాతానికి పైగా ఓట్లు సాధించినప్పటికీ.. మోదీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నందువల్ల, భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించుతారని భావించొద్దు."
-ప్రశాంత్ కిషోర్, రాజకీయ వ్యూహకర్త