అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయాన్ని సాధించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి.. మోదీ-షా జోడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 2024లో జరగనున్న సార్వత్రిక పోరుకు సెమీఫైనల్‌గా భావించిన ఈ ఎన్నికల్లో.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఏకపక్ష విజయం సాధించగా.. యూపీ సహా ఉత్తరాఖండ్, గోవా మణిపుర్లో భాజపా తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే కాంగ్రెస్ మాత్రం తన ఓటమి పరంపరను కొనసాగించింది. యూపీలో రెండు సీట్లను రాబట్టకోవడానికే ఆపసోపాలు పడింది. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రాష్ట్రాల్లో( రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ )నే అధికారానికి పరిమితమైంది.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి నాయకత్వంలో మరోసారి భాజపా అధికారంలోకి వచ్చి.. ఉత్తరాఖండ్, మణిపుర్లో రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకొని.. గోవాలో అతి పెద్ద పార్టీగా అవతరించి.. దేశ రాజకీయాల్లో కాషాయ దళానికి తిరుగులేదని మరోసారి చాటిచెప్పింది. భాజపా సాధించిన విజయం.. కమలనాధుల్లో జోష్ నింపగా.. కాంగ్రెస్‌ను మరింత కుంగదీసింది. దేశంలో ప్రత్యామ్నాయ కూటమి కోసం పావులు కదుపుతున్న ప్రాంతీయ పార్టీలకు షాక్ ఇచ్చింది.
భాజపా స్థానం మరింత సుస్థిరం!
ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని ఘటనలు భాజపా విజయావకాశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా రైతుల ఉద్యమం, లఖింపుర్ ఘటన.. దేశవ్యాప్తంగా భాజపాను వేలెత్తి చూపేలా చేశాయి. ఎన్నికల సమయంలో అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి.. పక్కా వ్యూహంతో ఓటర్లను తమవైపు తిప్పుకున్న భాజపా.. నాలుగు రాష్ట్రాల్లో సాధించిన విజయంతో.. దేశ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
2024 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఈ ఎన్నికల్లో విజయంతో.. ప్రత్యామ్నాయ కూటమి ఆశలపై నీళ్లు చల్లింది. సార్వత్రిక ఎన్నికల ఫలితం ఎలా ఉండనుందో సంకేతాలిచ్చింది.
సంస్కరణల అజెండాకు పదును!
నవ భారత నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ.. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదం స్ఫూర్తితో దేశంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత.. తమ సంస్కరణల అజెండా అమలును మరింత వేగవంతం చేసే అవకాశముంది. తాజా విజయాన్ని ప్రజలు ఇచ్చిన ఆమోదముద్రగా భావించి.. 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా.. భవిష్యత్‌లో మరిన్ని నూతన సంస్కరణలు తీసుకురావచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది.
మరింత తేలిపోయిన కాంగ్రెస్..
ఔనన్నా, కాదన్నా.. దేశంలో విపక్ష కూటమికి నాయకత్వం వహించాలంటే కాంగ్రెస్‌దే అగ్రస్థానం. కానీ.. ఇటీవల కాలంలో ఆ లెక్కలు మారుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. కమలనాధుల విజృంభణతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. యూపీలో అయితే కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. గోవా, ఉత్తరాఖండ్, మణిపుర్లో రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఇలాంటి పార్టీ.. 2024 ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందన్న చర్చ మొదలైంది.