అసోంను మరోసారి చొరబాట్లకు స్వర్గధామంగా భాజపా మారనివ్వదని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. గత ఐదేళ్లలో చొరబాట్లకు భాజపా ప్రభుత్వం చెక్ పెట్టిందని తెలిపారు. అసోంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తన చేతుల్లో ఉందన్న ఏఐయూడీఎఫ్ చీఫ్ అజ్మల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాళం, తాళం చెవి (ఏఐయూడీఎఫ్ పార్టీ గుర్తు) ప్రజల వద్ద ఉందని పేర్కొన్నారు. చిరాంగ్ జిల్లాలో బుధవారం జరిపిన పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.
"అసోంలో చొరబాట్లను భాజపా కట్టడి చేసింది. మాకు మరో ఐదేళ్లు ఇవ్వండి.. రాష్ట్రాన్ని చొరబాట్లు, వరద రహితంగా మారుస్తాం. జాగ్రత్తగా వినండి అజ్మల్.. అసోంను మరోసారి చొరబాటుదార్లకు స్వర్గధామంగా మారనివ్వము. తన పార్టీ గుర్తును పేర్కొంటూ అజ్మల్ అసోం ప్రభుత్వ ఏర్పాటు తన చేతుల్లో ఉందని అంటున్నారు. కానీ ఆయనకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆ తాళం, తాళం చెవి ప్రజల వద్ద ఉన్నాయి. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో వారే నిర్ణయిస్తారు."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి