తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపాకు బంగాల్​లో మెజారిటీ- అసోంలో అధికారం' - బంగాల్​లో భాజపా విజయం రాజ్​నాథ్ సింగ్

బంగాల్​ తొలి విడత పోలింగ్​లో ఓటింగ్ సరళిని బట్టి భాజపా అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. అసోంలో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ మరోసారి అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో ఎల్​డీఎఫ్-యూడీఎఫ్ కూటములకు భాజపా ప్రత్యామ్నాయంగా మారిందని చెప్పారు.

RAJNATH
రాజ్​నాథ్

By

Published : Mar 28, 2021, 11:33 AM IST

బంగాల్​ తొలి విడత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడం పట్ల కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్​ శాతం, ముందస్తు సరళిని బట్టి బంగాల్​లో భాజపా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.

ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. అసోంలో ఎన్​డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్ల వల్ల భారీ సంఖ్యలో ప్రజలు ఓటేసేందుకు తరలి వచ్చారని రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా బంగాల్ అధికార పార్టీ టీఎంసీపై విమర్శలు గుప్పించారు.

"బంగాల్ ఎన్నికల తొలి విడతలో అధిక ఓటింగ్ శాతం నమోదు కావడాన్ని చూస్తే.. ప్రతి దశలోనూ భాజపా గొప్ప విజయం సాధిస్తుందని స్పష్టమవుతోంది. ఈ సరళిని గమనిస్తే భాజపా స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. ఓటింగ్ శాతంలో పెరుగుదలను గమనిస్తే భాజపా చక్కగా పోరాడిందని అర్థమవుతోంది. ఇదివరకు టీఎంసీ విధ్వంస పాలన మాత్రమే ఉండేది. ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్ల వల్ల ప్రజలు బయటకు వచ్చి ఓటేశారు."

-రాజ్​నాథ్ సింగ్, కేంద్ర మంత్రి

అసోంలో భాజపా పనితీరుకు ఎలాంటి ఢోకా లేదని.. అభివృద్ధి, సుపరిపాలనలో తమ పార్టీకి మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో భాజపాకు సీట్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేరళలో ప్రత్యామ్నాయంగా..

కేరళలో ఎల్​డీఎఫ్-యూడీఎఫ్ కూటములకు భాజపా ప్రత్యామ్నాయంగా మారిందని అన్నారు రాజ్​నాథ్ సింగ్. విభజనపూరిత రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు. కుల, మత, వర్గాలకు తమ రాజకీయాలు అతీతమని చెప్పారు.

ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు కేరళకు వచ్చిన ఆయన.. అక్కడి విలేకరులతో మాట్లాడారు. ఎల్​డీఎఫ్-యూడీఎఫ్ కూటములే విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ రెండు కూటములు కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయని అన్నారు. కేరళలో ఒకరిపై ఒకరు పోటీ పడుతూ.. బంగాల్​లో కలిసి బరిలోకి దిగుతున్నాయని కాంగ్రెస్-వామపక్షాలపై విమర్శలు గుప్పించారు.

తిరువనంతపురం రోడ్​షోలో రాజ్​నాథ్
తిరువనంతపురం రోడ్​షోలో రాజ్​నాథ్

"ఎల్​డీఎఫ్-యూడీఎఫ్ కూటములకు కాలం చెల్లింది. రెండు కూటములు కేరళ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోయాయి. ప్రజలకు మార్పు కావాలి. వీరిరువురు తప్పుడు హామీలు ఇస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాలతో కేరళను అభివృద్ధి మార్గం నుంచి తప్పించారు. ఎల్​డీఎఫ్-యూడీఎఫ్​లలో ఎవరు గెలిచినా కేరళ ప్రజలు ఓడినట్లే."

-రాజ్​నాథ్ సింగ్, కేంద్ర మంత్రి

ABOUT THE AUTHOR

...view details