Uttarakhand CM on Elections: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. చరిత్రను తిరగరాసి రెండోసారి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది. ఈ క్రమంలో మంత్రిగా ఉన్న హరక్ సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అదే సమయంలో కొందరు సీనియర్లు కూడా భాజపాను వీడారు. ఈ నేపథ్యంలో పార్టీలోని అంతర్గత పరిణామాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తున్నారనే అంశాలపై సీఎం పుష్కర్ సింగ్ ధామి.. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ సొంత విధానాలతోనే ఎన్నికల్లో పోరాడతామని, పార్టీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సీఎం ధామి.
మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడం వల్లే హరక్ సింగ్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం స్పందించారు.
"మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం మా ప్రభుత్వం గణనీయమైన మొత్తాన్ని కేటాయించింది. పార్టీలో ఉన్నన్ని రోజులు ఆయనకు గుర్తింపు, గౌరవాన్ని సంపూర్ణంగా అందించాం."
-సీఎం పుష్కర్ సింగ్ ధామి
హరక్ సింగ్ రావత్‌ను కేబినెట్ నుంచి తొలగించడానికి, పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి అసలు కారణాలను కూడా వివరించారు పుష్కర్ సింగ్ ధామి. 'సిద్ధాంతాల ఆధారంగా మా పార్టీ పనిచేస్తుంది. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. వ్యతిరేక కార్యకలాపాలు చేసినా.. వారిపై చర్యలు ఉంటాయి.' అన్ని స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్‌లో సర్వేలు ఏం చెబుతున్నాయి? ప్రజలు ఏం అనుకుంటున్నారనే అనే విషయాలపై సీఎం తన మనోగతాన్ని వెల్లడించారు.