Bjp Up Election: ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపా తన ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా.. దిల్లీ నుంచి 150 మందికిపైగా నేతలను ఈ రెండు రాష్ట్రాలకు పంపించింది. 100 మందికిపైగా సీనియర్ నేతలు, కార్యనిర్వాహకులు పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా భాజపా అధిష్ఠానం నియమించింది. వీరంతా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ విషయాన్ని దిల్లీలోని భాజపా వర్గాలు వెల్లడించాయి.
Bjp teams to states: జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో భాజపా నేతల బృందాల పనితీరును దిల్లీ భాజపా అధ్యక్షుడు విజేంద్ర గుప్తా, భాజపా ప్రధాన కార్యదర్శి దినేశ్ ప్రతాప్ సింగ్ పర్యవేక్షించనున్నారు. "ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పార్టీకి సాయం చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నేతలను పంపడం సాధారణ ప్రక్రియ. దిల్లీకి సమీపంలో పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉండడం వల్ల అక్కడి నేతలను ఈ రాష్ట్రాలకు పంపుతున్నారు"అని దిల్లీకి చెందిన భాజపా సీనియర్ నేత ఒకరు తెలిపారు.
'గెలుపు మాత్రమే కాదు..'
Bjp Uttarakhand Polls: పశ్చిమ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 50 రోజులపాటు దిల్లీ నేతలు ఉంటారని సదరు సీనియర్ నేత పేర్కొన్నారు. "ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అధికారాన్ని మరోసారి చేపట్టడమే కాకుండా.. గతంలో కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యం" అని పేర్కొన్నారు.
దిల్లీ భాజపా ఉపాధ్యక్షులు వీరేంద్ర సచ్దేవ సహా అశోక్ గోయెల్ దేవ్రాహా, సునీల్ యాదవ్, భాజపా అధికార ప్రతినిధులు విక్రమ్ బిధూరీ, ఆదిత్య ఝా, మోహన్ లాల్ గోహారా, బ్రిజేశ్ రాయ్, మాజీ మేయర్ జై ప్రకాశ్ జేపీ వంటి నేతలు ఉత్తర్‌ప్రదేశ్‌లో మోహరించిన నేతల్లో ఉన్నారు. మరో 60 మంది నేతలు ఉత్తరాఖండ్‌లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.
ఇదీ చూడండి:'పటేల్ జీవించి ఉంటే ముందుగానే గోవాకు స్వాతంత్య్రం'