వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి విజయ కేతనం ఎగురవేయాలని, లేని చోట్ల ఉనికిని చాటుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, రాష్ట్రాల నాయకత్వానికి దిశానిర్దేశం చేయడానికి నేరుగా అధిష్ఠానం రంగంలోకి దిగింది.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన సంస్థాగత నిర్ణయాలను సైతం వెనువెంటనే తీసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి మార్పే ఇందుకు నిదర్శనం.
వచ్చే ఏడాది గోవా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే భాజపా అధిష్ఠానం మాత్రం.. సార్వత్రిక ఎన్నికల్లో కీలకం కానున్న యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
చర్చలు ఇలా..
గతవారం దిల్లీకి వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. అమిత్ షా, మోదీలను వేర్వేరుగా కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అలాగే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించారు.
ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే ఏకంగా ముఖ్యమంత్రిని మార్చిన అధిష్ఠానం.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది.
భాజపా పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడితో అమిత్ షా ఇప్పటికే సమావేశమయ్యారు. రైతుల ఆందోళనలతో పాటు రాష్ట్రంలోని కుంభకోణాలపై చర్చలు జరిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
గుజరాత్‌పై ప్రత్యేక దృష్టి
సొంతగడ్డ గుజరాత్‌పై మోదీ, షా ద్వయంతో పాటు కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎం విజయ్ రూపానీని బాధ్యుడిని చేస్తూ.. విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌పై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది నాయకత్వం.
రెండు రోజుల క్రితమే గుజరాత్లో పర్యటించి.. దిల్లీకి వచ్చారు ఆ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ భూపేంద్ర యాదవ్. రాష్ట్రంలో పరిస్థితిపై పార్టీ పెద్దలకు నివేదిక అందించారు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ ఆయన్ను గుజరాత్‌కు పంపింది పార్టీ అధిష్ఠానం. దీన్ని బట్టి అర్థం అవుతుంది భాజపా కేంద్ర నాయకత్వం గుజరాత్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తోందనేది.