బంగాల్లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (భాజపా) వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా 109 ముఖ్యమైన నియోజక వర్గాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపనుందని సమాచారం. గత వారంలో చేసిన సర్వే ప్రకారం ఆయా నియోజకవర్గాలపై దృష్టిసారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
సర్వే ఆధారంగా తన వ్యూహాలను మార్చుకుంది భాజపా. అందుకోసం పార్టీలో విశేష అనుభవం ఉన్న 22మంది ముఖ్య నేతలకు ఆ బాధ్యతను అప్పగించింది.
బాధ్యతలు వీరికే!
నిషికాంత్ దుబే, వినోద్ సోన్కర్, వినోద్ తావ్డే, ధర్మేంద్ర ప్రధాన్, ప్రదీప్ సింగ్ వాఘేలా, బసంత్ పాండే, ఆర్కే సింగ్, మంగళ్ పాండే, రమేశ్ బిధురీ, రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, నితిన్ నవీన్, వినయ్ సహస్రబుద్ధీ, ఆశిష్ షేలర్, రాధామోహన్ సింగ్, మదన్‌లాల్ శర్మ, సతీశ్ ఉపాధ్యాయ
కీలక సమావేశాలు
శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై దిల్లీలో ఈ నెల 20న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సభకు ఎన్నికలు జరిగే రాష్ట్రాల అధికారులు, భాజపా జాతీయ కార్యదర్శులందరూ హాజరుకానున్నారు.
మోదీ భేటీ
ఈ నెల 21న భాజపా జాతీయ కార్యవర్గం సమావేశంకానుంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభలో అంతర్గత వ్యవహారాలు సహా జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
93 స్థానాల్లో కాంగ్రెస్!
ఈసారి ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపాలకు అవకాశం ఇవ్వరాదని కూటమిగా బరిలోకి దిగుతోంది కాంగ్రెస్. లెఫ్ట్ పార్టీలు సహ ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్‌తో కలిసి పోటీ చేయనుంది. దాదాపు 93 స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులను నిలపనుందని సమాచారం. సీట్ల సర్దుబాటుపై గురువారం కూడా కొనసాగిన చర్చల్లో.. కూటమి భాగస్వాముల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో 92 సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్ 44 కైవసం చేసుకుంది. అయితే ఎక్కువ స్థానాల్లో పోటీపడటం కన్నా బలం ఉన్న నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం. బిహార్‌లో 70 స్థానాలకు పోటీ చేసి కేవలం 19 గెలిచినందున ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:అమిత్ షాజీ.. నా అల్లుడిపై గెలిచి చూపించండి: దీదీ