కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం విఫలమయిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో భాజపా ఆర్ఎస్ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అక్కడి పరిస్థితులు దారుణంగా ఉండటంపై అగ్ర నాయకుల్లో ఆందోళన వ్యక్తమయింది. భాజపాకు అత్యంత కీలకమైన ఈ రాష్ట్రంలో.. గంగా నదిలో శవాలు కొట్టుకురావడం కలవరపరిచింది. అన్ని వనరులను మోహరించినా బంగాల్లో మమత విజయాన్ని అడ్డుకోలేకపోయామన్న భావన ఆ పార్టీలో ఉంది. దానికితోడు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు మరింతగా నిరాశ కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దిల్లీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పాల్గొన్నారు. పార్టీపైనా, రానున్న ఎన్నికలపైనా కరోనా చూపే ప్రభావంపై ప్రధానంగా చర్చించారు. విమర్శలను అధిగమించేలా కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా వివిధ సూచనలు చేస్తూ కార్యకర్తలకు లేఖ రాశారు.