తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ-యోగి కాంబో సూపర్ హిట్.. యూపీలో అఖండ విజయం

UP Results 2022: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో భాజపా ఘన విజయం సాధించింది. మోదీ-యోగి ద్వయం ఛరిష్మాతో ఆ పార్టీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు కీలక ఓబీసీ నేతలు పార్టీని వీడినా, రైతులు, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ అఖండ విజయానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

UP Election Results 2022
మోదీ-యోగి కాంబో సూపర్ హిట్.. యూపీ పీఠం మళ్లీ భాజపాదే

By

Published : Mar 10, 2022, 5:20 PM IST

UP Election Results: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-యోగి కాంబో సూపర్​ హిట్ అయింది. అభివృద్ధి నినాదంతో ముందుకెళ్లిన భాజపా కూటమే మరోసారి అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులు, రైతులు, కొన్ని సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత ఉన్నా.. భవిష్యత్​పై భరోసాతో ప్రజలు కమలం పార్టీకే పట్టంగట్టారు. ఎన్నికలకు ముందు కీలక ఓబీసీ నేతలు పార్టీని వీడినా.. మోదీ-యోగి ద్వయం అన్నీ తామై భాజపాను విజయ తీరాలకు చేర్చింది.

యోగితో మోదీ

36 ఏళ్ల తర్వాత..

ఎన్నికల ప్రచారంలో యోగి

యూపీలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్​.. 1980-88 మధ్య వరుసగా అధికారం చేపట్టింది.ఆ తర్వాత సమాజ్​ వాదీ పార్టీ, బహుజన్​ సమాజ్​వాదీ పార్టీ, భాజపా వల్ల రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. 1990లో భాజపా విజయం సాధించింది. మళ్లీ 2000 సంవత్సరంలో బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల ఏడాది కూడా పీఠాన్ని కాపాడుకోలేకపోయింది. 2000 తర్వాత 2017లోనే కమలం పార్టీ యూపీని తిరిగి చేజిక్కించుకుంది. ఏకంగా 312 స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోమారు అవే ఫలితాలను రిపీట్ చేసింది. కాకపోతే సీట్ల సంఖ్య కాస్త తగ్గింది.

యూపీలో భాజపా విజయానికి ప్రధాన కారణాలేంటి? ఆ పార్టీ అనుసరించిన వ్యూహాలు ఎలా కలిసొచ్చాయి? ప్రధాని మోదీ, సీఎం యోగి ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేసి విజయవంతం అయ్యారు? ఇప్పుడు చూద్దాం..

BJP Retains UP

యోగి మార్క్​ పాలన..

ఉత్తర్​ప్రదేశ్​లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక తనదైన శైలిలో పాలన సాగించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపైనే ప్రధాన దృష్టిసారించారు. గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. యూపీలో గత ప్రభుత్వాలు కుటుంబాలు, రౌడీ షీటర్ల కోసమే పని చేసి అభివృద్ధిని పట్టించుకోలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తమ హయాంలో అవినీతి, నేరాలు గణనీయంగా తగ్గాయని పదే పదే ప్రస్తావించారు. ఐదేళ్ల పాలనలో తమ పార్టీ సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని చెప్పారు.

ఎన్నికల ర్యాలీలో మోదీ-యోగి

⦁ 2017 మార్చిలో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. బుల్లెట్‌కు బుల్లెట్‌తో సమాధానం చెప్పాలని, పోలీసులకు పూర్తి అధికారం ఇస్తున్నానని ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

⦁ గత అయిదేళ్లలో పోలీసులు 182 మంది క్రిమినల్స్‌ను హతమార్చారు. చాలా వరకు ఎదురుకాల్పులు బూటకమైనవేనని మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. పోలీసులు వాటిని ఖండించారు.

⦁ నేరగాళ్లను గాయపరిచే ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా 4206 మంది కాళ్లలోకి పోలీసులు కాల్పులు జరిపారు.

UP poll results 2022

ఫలించిన హిందుత్వ అస్త్రం..

మోదీతో యోగి భేటీ

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమంతో పాటు హిందుత్వ అస్త్రాన్ని కూడా ప్రధానంగా ప్రయోగించింది భాజపా. మతపరమైన అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ని హిందువుల వ్యతిరేక పార్టీగా చిత్రీకరించింది. ఎస్పీకి బలంగా ఉన్న ఓబీసీ ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు కమలం పార్టీ హిందుత్వ వాదాన్ని ఈసారి మరింత పెంచింది.

ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించిందని స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథే​ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఆ పార్టీ హయాంలో రంజాన్‌ వంటి ముస్లింల పర్వదినాల్లో విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగేదని.. హోలీ, దీపావళి వంటి పండుగలకు మాత్రం కోతలు ఉండేవని పలు ఉదాహరణలు ప్రజలకు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చినప్పటినుంచి అయోధ్యలో దీపోతవ్సవం, మథురలో రంగోత్సవం, కాశీలో దేవ దీపావళిని ఘనంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఖబ్రిస్థాన్‌(ముస్లిల శ్మశానవాటిక)ల ప్రహరీలకే అధికంగా నిధులు కేటాయించిందని.. ఇప్పుడు అక్కడికే వెళ్లి ఓట్లు అడుక్కోవాలని పలుమార్లు అఖిలేశ్‌ను ఉద్దేశించి యోగి వ్యాఖ్యానించారు.

అంతేకాదు యూపీ ఎన్నికలను '80% వర్సెస్‌ 20%'గా యోగి అభివర్ణించారు. దీనిపై పెద్దఎత్తున చర్చ కూడా జరిగింది. రాష్ట్రంలో దాదాపు 20%గా ఉన్న ముస్లింలను ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు కూడా వచ్చాయి.

UP BJP News

కీలక ఓబీసీ నేతలు దూరమైనా..

భాజపాకు అగ్రవర్ణాల ఓటర్లు దశాబ్దాలుగా అండగా నిలుస్తున్నారు. వారితోపాటు ప్రధానంగా యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితులు అండగా నిలవగా.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో అఖిలేశ్‌ వ్యూహాత్మకంగా ఆర్‌ఎల్‌డీ, మహాన్‌దళ్‌, ఎస్‌బీఎస్‌పీ వంటి ఏడు చిన్న పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటుచేశారు. అవన్నీ వివిధ సామాజికవర్గాల మద్దతుతో మనుగడ సాగిస్తున్నవే. అదే సమయంలో స్వామిప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌ సహా ఇతర కీలక ఓబీసీ నేతలు ఎన్నికలకు ముందు భాజపాను వీడారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా ఓబీసీలు పార్టీ నుంచి దూరం జరిగి, గత ఎన్నికల నాటి తమ గెలుపు సమీకరణం దెబ్బతినే ముప్పుందని భాజపా గ్రహించింది. అందుకే మళ్లీ కుల/మతాల లెక్కలు, హిందుత్వ గళంతో ఆయా వర్గాలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించి విజవంతమైంది. ఇందులో భాగంగానే మత ప్రాతిపదికన ఓటర్లను ఏకోన్ముఖుల్ని చేసే చర్యలు చేపట్టింది. 80% వర్సెస్​ 20% పోరు, కృష్ణ జన్మభూమిలో ఆలయ నిర్మాణం, 'అబ్బా జాన్‌' అని అనే వారికే ప్రభుత్వ పథకాలు పరిమితం చేయలేదని చెప్పింది. అప్నాదళ్​, నిషాద్​ పార్టీలతో జట్టు కట్టి ఘన విజయం సాధించింది.

UP CM Yogi News

గోరఖ్​పుర్​ స్కెచ్​ సూపర్ హిట్​

యోగి ఆదిత్యనాథ్​​ గోరఖ్​పుర్ స్థానం నుంచి పోటీ చేయడం భాజపా వ్యూహాత్మక నిర్ణయం అనే చెప్పాలి. ఈ ప్రాంతంలో ఆయనకు విశేష ఆదరణ ఉంది. యోగిని గోరఖ్​పుర్​ ప్రాంతంలో 'మహారాజ్​ జీ' అని పిలుస్తుంటారు. 1998 నుంచి వరుసగా ఐదు సార్లు గోరఖ్​పుర్​ నుంచే లోక్​సభకు ఎన్నికై సత్తా చాటారు. 2002లో యోగి స్థాపించిన హిందూ యువ వాహిని ప్రభావం కూడా గోరఖ్​పుర్​లో బాగా ఉంది. అందుకే ఈ చుట్టుపక్కల 62 స్థానాలు కొల్లగొట్టాలనే లక్ష్యంతోనే ఏరికోరి భాజపా అధిష్ఠానం యోగికి ఈ స్థానాన్ని ఎంపిక చేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్​ ఈ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహించడం వల్లే గోరఖ్​పుర్​ సహా చుట్టుపక్కల భాజపా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.

గోరఖ్​పుర్ పట్టణ నియోజకవర్గం అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ పేరును భాజపా ప్రకటించగానే హిందూ యువ వాహిని సభ్యులంతా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. బూత్ స్థాయిలో యోగికి మద్దతు కూడగట్టారు. సామాజిక మాధ్యమాల్లోనూ యోగికి మద్దతుగా పెద్దయెత్తున ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో ఆయన చేసిన పనులను ప్రజలకు వివరించారు.

సాగుచట్టాల సవాలును ఎదురీది..

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం 2020లో తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలపై దేశవ్యాప్తంగా అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా పశ్చిమ యూపీ రైతులు భాజపాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను వెనక్కి తీసుకోవాలని దిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు నిర్విరామంగా నిరసనలు కొనసాగించారు. జాట్​ల సామాజిక వర్గంలో అత్యంత ఆదరణ ఉన్న రాకేశ్ టికాయిత్​ ఈ ఆందోళనలకు నేతృత్వం వహించారు. ఈ సామాజిక వర్గం యూపీలో బలంగానే ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, భాజపాకు ప్రతికూలాంశం అవుతుందని అంతా భావించారు. అయితే 2021 నవంబర్​లో సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. దీంతో అన్నదాతలు ఆందోళనలు విరమించారు. కానీ, కనీస మద్దతు ధర చట్టం సహా తమ ఇతర డిమాండ్లు నెరవేర్చాలని వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత మూడు నెలల విరామంతోనే ఎన్నికలు జరిగాయి. భాజపాపై ఇంకా రైతులు గుర్రుగానే ఉన్నారు. అయినప్పటికీ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న కమలం పార్టీ.. రైతు వ్యతిరేకతను అధిగమించింది. తాము రైతులకు వ్యతిరేకం కాదని, సాగు నీటికి ఉచిత కరెంటు ఇస్తామని ఎన్నికల హామీల్లో చేర్చింది. దీంతో ఎన్నికల్లో ప్రతికూలతలను అధిగమించి ఘన విజయం సొంతం చేసుకుంది.

Modi news

మోదీ ప్రజాకర్షణ...

ఎన్నికల ర్యాలీలో మోదీ-యోగి

భాజపాలో అత్యంత ప్రజాదరణ గల నేత ప్రధాని నరేంద్ర మోదీ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ ముఖచిత్రమే ఆయన. ఎక్కడ ఎన్నికల జరిగినా కమలం పార్టీ నుంచి మోదీ పేరే మారుమోగుతుంది. యూపీలోనూ మోదీకి విశేష ఆదరణ ఉంది. ఈ రాష్ట్రంలోని వారణాసి నియోజకవర్గం నుంచే ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేశారు మోదీ. ఎన్నికలకు ముందు యోగితో కలిసి యూపీలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని జిల్లాలను కవర్​ చేసేలా పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించారు. యూపీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే భాజపాకు మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను భాజపా కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఎస్పీ, బీఎస్పీ హయాంలో 'అరాచక పాలన' గురించి ప్రజలకు గుర్తు చేశారు. ఆ పార్టీలు గెలిస్తే స్వార్థ ప్రయోనాల కోసం పని చేస్తాయి తప్ప, ప్రజల అవసరాలను పట్టించుకోవని పదునైన విమర్శలు గుప్పించారు. కరోనా కారణంగా ఎన్నికల ప్రచారానికి ఆటంకాలు ఎదురైనా.. వర్చువల్​ ర్యాలీల ద్వారా కూడా ముమ్మర ప్రచారం చేశారు. అలా భాజపా విజయంలో కీలక పాత్ర పోషించారు. యోగితో మోదీకి ఉన్న సాన్నిహిత్యం కూడా యూపీ ఎన్నికల్లో భాజపాకు కలిసొచ్చింది.

కలిసొచ్చిన ప్రజా మేనిఫెస్టో

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కూడా ఓ రకంగా కలిసొచ్చింది. రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని సాగు నీటికి ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర సహా చక్కెర మిల్లుల పునరుద్ధరణకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది. అలాగే ఇతర సంక్షేమ పథాకాలు, లవ్​ జిహాద్​కు 10ఏళ్ల జైలు శిక్ష వంటి మేనిఫెస్టోలోని ఇతర అంశాలు కూడా ఎన్నికల్లో సానుకూల ప్రభావం చూపాయి.

2024 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని భావిస్తున్న తరుణంలో యూపీలో ఘన విజయం కమలం పార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపింది.

ABOUT THE AUTHOR

...view details