Manipur Election Results: ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2017 ఎన్నికల్లో 21 సీట్లే గెలిచినప్పటికీ ఇతర ప్రాంతీయ ప్రాంతాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ.. ఈసారి మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి 32 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో బీరెన్ సింగ్ మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే 2020లో భాజపా తిరుగబాటుదారులు బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చినంత పనిచేశారు. కాంగ్రెస్, ఎన్పీపీ నాయకులతో కలిసి ఆయన్ను ఇరకాటంలో పెట్టాలనుకున్నారు. కానీ జాతీయ నాయకత్వం అండతో బీరెన్ సింగ్ అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి మరోమారు సీఎం పగ్గాలు చేపట్టనున్నారు.
Manipur Results
అమిత్ షా అండ..
సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ బీరెన్ సింగ్కు భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండగా నిలిచారు. బీరెన్ నాయకత్వంలో భాజపా ఎన్నికలకు వెళ్తున్నట్లు ఇంపాల్లో జరిగిన ర్యాలీలో ప్రకటించారు. దీంతో ఆయనకు విశ్వాసం పెరిగింది.
అయితే 2017 ఎన్నికల అనంతరం నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), జనతాదళ్ యునైటెడ్(జేడీయూ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా.. 2022లో ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి తృటిలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి వామపక్ష పార్టీలు సహా ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసింది.
కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వలస వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చింది పార్టీ. వీరిలో కొంతౌజామ్ గొవిందాస్, మూడు సార్లు కాంగ్రెస్ సీఎంగా ఉన్న ఇబోబి సింగ్ బంధువు ఒక్రామ్ హెన్రీ, సీఎం బీరెన్ సింగ్ అల్లుడు రాజ్కమార్ ఇమో సింగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. తమ సీనియర్ నేతలను కాదని మరీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే అవకాశం ఇచ్చింది కమలం పార్టీ.
BJP Manipur News