పుదుచ్చేరిలో ఓటర్లను ఆకర్షించేందుకు భారీ తాయిలాలను ప్రకటించింది భాజపా. అధికారంలోకి వస్తే.. మత్స్యకారులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇస్తూ.. తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పుదుచ్చేరి ప్రజల సలహాల మేరకే మేనిఫెస్టోను రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
మేనిఫెస్టోలని ప్రధాన అంశాలు..
- ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన
- కమ్యూనిటీ క్రీడా కేంద్రాల ఏర్పాటు
- మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం
- పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రూ.2,000 ఆర్థిక సహాయం
- వచ్చే ఐదేళ్లలో పుదుచ్చేరిలో నీటి భద్రతకు ఏర్పాట్లు
- రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద సమగ్ర పశు అభివృద్ధి కేంద్రం ఏర్పాటు
- మత్స్యకారులకు ముద్ర రుణాలు
- చేపల వేట నిలిచిన సమయంలో ఇచ్చే భత్యం రూ.5 వేల నుంచి రూ.8 వేలకు పెంపు
- మత్స్యకారులకు ఫైబర్ బోట్లు, డీజిల్, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి సబ్సిడీలు
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా.. కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, గిరిరాజ్ సింగ్‌లు పాల్గొన్నారు.
కేజీ టూ పీజీ.
'పుదుచ్చేరి విద్యా మండలి' ఏర్పాటు ద్వారా 'కేజీ టూ పీజీ' వరకు విద్యార్థినులకు ఉచిత, నాణ్యమైన విద్య అందజేస్తామని ప్రకటించింది భాజపా. ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులందరికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, బాలికలందరికీ ఉచితంగా స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్..
సులభత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు నూతన పారిశ్రామిక, పెట్టుబడి విధానాల అమలు సహా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరమే 'గ్లోబల్ ఇన్వెస్ట్ పుదుచ్చేరి సమ్మిట్' నిర్వహించనున్నట్లు భాజపా వాగ్దానం చేసింది. అంకురాలకు రూ.25 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించేందుకు 'స్టార్టప్ పుదుచ్చేరి ఫండ్' ఏర్పాటు చేస్తామని తెలిపింది.