Kishan Reddy Speech Public Meeting In Warangal : ప్రధాని కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందో చెప్పాలని కేంద్రమంత్రి, నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెడుతున్నందుకు బహిష్కరిస్తున్నారా.. లేక రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు ఇస్తున్నందుకు బహిష్కరించారా అని బీఆర్ఎస్కు ప్రశ్నల వర్షం కురిపించారు. బహిష్కరించాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ముందుగా.. హామీలు ఇచ్చి తప్పినందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పేపర్ లీకేజీ ద్వారా నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోసినందుకు యువత.. ఉచిత ఎరువులు ఇవ్వనందుకు రైతులు కేసీఆర్ను బహిష్కరించాలని కోరారు. హనుమకొండలోని బీజేపీ విజయసంకల్ప సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే దుష్ప్రచారం చేస్తున్నారని.. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్తో కలవదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ.. అవినీతి పార్టీలేనని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే.. వీటికి రానున్న రోజుల్లో భవిష్యత్తు అనేది ఉండదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్లేనని ఆరోపించారు.
Kishan Reddy Comments On BRS : మోదీ ప్రధాని అయ్యాకే జాతీయ రహదారులు మెరుగయ్యాయని కేంద్ర మంత్రి, నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. అలాగే రూ.1900 కోట్లతో హైదరాబాద్-వరంగల్ రహదారిని మంజూరు చేశామన్నారు. ఇవాళ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా 3వేల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.