BJP Promises In Madhya Pradesh :ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలపై వరాల జల్లు కురిపించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మహిళలకు లాడ్లీ బెహ్నా పథకం కింద ఇచ్చే వెయ్యి రూపాయల భృతిని రూ.1,250కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు ఆగస్టు నెలలో రూ.450 కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు వివరించారు. శ్రావణ మాసం సందర్భంగా భోపాల్లో ఆదివారం మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు హామీలు ఇచ్చారు.
"శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు నెలలో రాష్ట్రంలోని మహిళలు రూ. 450కే గ్యాస్ సిలిండర్ను ఇస్తాం. ఆ తర్వాత దీనిపై పూర్తి స్థాయి వ్యవస్థను తీసుకువచ్చి తక్కువ ధరకే అందిస్తాం. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మొదట రూ.250 మహిళల ఖాతాల్లో వేస్తాం. ఆ తర్వాత మిగిలిన రూ.1,000ను సెప్టెంబర్లో జమ చేస్తాం. అక్టోబర్ నుంచి రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళలు రూ. 1,250 పొందుతారు. ఈ మొత్తాన్ని దశల వారీగా రూ.3000కు పెంచుతాం. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా పురోగతి సాధించేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం."
--శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి
ప్రస్తుతం మహిళలకు ఉన్న 30 శాతం రిజర్వేషన్లను 35 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఉపాధ్యాయుుల నియామకాల్లో 50 శాతానికి పెంచుతున్నట్లు వివరించారు. మహిళలు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు పారిశ్రామిక వాడల్లో స్థలాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు. మహిళల నెలవారీ ఆదాయాన్ని రూ.10,000కు పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. అక్రమణలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుని మహిళలకు కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్న పలువురు మహిళల కాళ్లను కడిగారు. రాఖీ పండుగ నేపథ్యంలో హిందీ సినిమాలోని ఓ పాటను సైతం సీఎం పాడారు.