దేశంలో వంద కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీని పూర్తి చేసినందుకు భారతీయ జనతా పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించింది. దిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ భేటీలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలు.. మోదీని గజమాలతో సత్కరించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులు, భాజపాపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.
కరోనా ప్రబలిన తర్వాత తొలిసారి.. భాజపా జాతీయ కార్యవర్గం ప్రత్యక్షంగా సమావేశమైంది. ఇతర రాష్ట్రాల్లోని జాతీయ కార్యవర్గ సభ్యులు, నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ప్రశంసలు..
ఈ సందర్భంగా.. ప్రధానిపై ప్రశంసలు కురిపించారు నడ్డా. కొవిడ్ సమయంలో ఎంతో ధైర్యంతో లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని, ఆర్థిక సవాళ్లను అధిగమించారని కొనియాడారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు వేగంగా నిత్యావసరాలు అందించిందని, కరోనాను సమర్థంగా ఎదుర్కొందని అన్నారు. మోదీనే మొత్తం ముందుండి నడిపించారని స్పష్టం చేశారు.
కొవిడ్‌ను ఎలా ఎదుర్కోవాలో మోదీ.. ప్రపంచానికి చూపించారని పేర్కొన్నారు నడ్డా. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు.