ఏఐఎంఐఎం(ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహదుల్ ముస్లిమీన్), ఐఎస్ఎఫ్(ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్) పార్టీలపై బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. హిందూ, ముస్లింలను విభజించేందుకు ఆ పార్టీలు భాజపా నుంచి డబ్బులు తీసుకున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ఆర్సీ వద్దనుకుంటే.. ఆ రెండు పార్టీలకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. వారికి ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని అన్నారు. భాజపా.. బంగాల్లో విభజన రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
"హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు.. హరే కృష్ణ హరే హరే, తృణమూల్ ఘరే ఘరే(ప్రతి ఇంట్లో తృణమూల్) అంటున్నారు. అయితే భాజపా మాత్రం హరే కృష్ణ హరే హరే, హిందూ, ముస్లిం, షెడ్యూల్డ్ కులాలు భాగ్ కరే(తరిమేయండి) అని అంటోంది. బంగాల్లో హిందువులు-ముస్లింలు కలిసి టీ తాగుతారు. దుర్గా పూజను సైతం కలిసి జరుపుకుంటారు. అది మా సంస్కృతి."
-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి
ఉచిత వైద్యం..
రైదిఘి బహిరంగ సమావేశానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మమత.. మన గ్రామాల్లో అశాంతి ఉంటేనే భాజపాకు ప్రయోజనం అని విమర్శించారు. ఎస్సీలు తనతో కలిసి తన ఇంట్లో భోజనం చేయగలరని.. అయితే భాజపా నేతలు మాత్రం ఫైవ్‌స్టార్ హోటళ్ల నుంచి తెచ్చిన ఆహారాన్ని మాత్రమే తింటారని ఎద్దేవా చేశారు.