తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభ సీట్లు త్వరలోనే 1000కి పెంపు- నిజమెంత?

దేశంలో లోక్​సభ స్థానాల పెంపు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలలోపే.. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 1000, అంతకంటే ఎక్కువకు పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంత? లోక్​సభ సీట్లు పెంచే ఆలోచనతోనే కేంద్రం సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తోందా?

INCREASE LOK SABHA STRENGTH
లోక్​సభ స్థానాల సంఖ్య వెయ్యికి పెంపు

By

Published : Jul 26, 2021, 6:18 PM IST

దేశంలో లోక్​సభ సీట్ల సంఖ్య పెంపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2024 ఎన్నికలలోపు సీట్ల సంఖ్యను 543 నుంచి వెయ్యి, ఆపైకి పెంచాలని కేంద్రం యోచిస్తోందని ఊగాహానాలు వినిపిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్​ సీనియర్​ నేత మనీశ్​ తివారీ తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. భాజపాలో ఉండే తన సహచర ఎంపీల ద్వారా లోక్​సభ సీట్ల పెంపు విషయం తనకు తెలిసిందని ఆయన చేసిన ట్వీట్​ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

"సీట్ల పెంపు నిజామా? కాదా? అనేది నాకు తెలియదు. కానీ 2024 ఎన్నికలకు ముందే లోక్​సభ సీట్లను 1000, అంతకన్నా ఎక్కువకు పెంచాలని చర్చలు జరుగుతున్నట్లు భాజపాలోని సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. కొత్త పార్లమెంట్​ ఛాంబర్​ వెయ్యి సీట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. అయితే.. సీట్ల సంఖ్య పెంచే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. దేశం కోసం చట్టాలు చేయటం ఎంపీల పని. అది భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​ ప్రకారం లభించింది. లోక్​సభ స్థానాలు 1000కి పెంచటం నిజమైతే.. చాలా సమస్యలు ఎదురవుతాయి. సీట్ల పెంపుతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ కల్పించటం గురించి కూడా ఆలోచిస్తే మంచిది. 1000 మందిలో 33 శాతం రిజర్వేషన్​ కల్పిస్తే.. 543 మందిలో ఎందుకు కల్పించలేకపోయారు? దాని కోసం రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ పోరాడుతున్నారు. "అని వరుస ట్వీట్లు చేశారు మనీశ్.

సీట్ల పెంపు ఎందుకు? గతంలో ఎప్పుడు చేశారు?

దేశంలో ప్రతి 10 లక్షల మందికి ఒక పార్లమెంటు సభ్యుడు ఉండాలి. కానీ, జనాభా గణన జరిగినప్పుడల్లా లోక్​సభ సభ్యుల సంఖ్య మారటం లేదు. తొలిసారి 1967 ఎన్నికల సమయంలో 1961 జనాభా లెక్కల ప్రకారం సీట్ల సంఖ్య 520కి పెంచారు. ఆ తర్వాత 1976 ఎన్నికలు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరిగాయి. దాంతో సీట్లు 543కు చేరాయి. ఆ తర్వాత జనాభా గణన జరుగుతూనే ఉన్నా.. సీట్ల సంఖ్య మాత్రం మారలేదు.

అందుకూ ఓ కారణం లేకపోలేదు. 1970 తర్వాత జనాభా నియంత్రణ కోసం కృషి చేశాయి ప్రభుత్వాలు. దానివల్ల తమిళనాడు, కేరళ, బంగాల్​ వంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల చాలావరకు తగ్గింది. కానీ.. తమ లోక్​సభ స్థానాలు ఎందుకు తగ్గాలి అని ఆ రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 వరకు లోక్​సభ స్థానాలను మార్చకూడదని కేంద్రం నిర్ణయించింది. దాని ప్రకారం.. 2031లో జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు సీట్ల సంఖ్యలో మార్పు ఉండకపోవచ్చు.

కానీ, ఇప్పుడు సీట్ల పెరుగుదల అంశం తెరపైకి రావటం ప్రాధాన్యం సంతరించుకుంది.

సెంట్రల్​ విస్టా నిర్మాణం అందుకేనా?

కొత్త పార్లమెంట్​, సచివాలయం, ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలు, మంత్రుల కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును చేపట్టింది కేంద్రం. ఇందుకు సంబంధించిన వివరాలను ఇటీవల సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించింది కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రజాపనుల విభాగం(సీపీడబ్యూడీ). 2026 తర్వాత సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉన్న దానిని దృష్టిలో పెట్టుకుని కొత్త భవనం నిర్మిస్తున్నట్లు తెలిపింది. కొత్త లోక్​సభ ఛాంబర్​లో​ 876 మంది, ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో 1,224 మంది కూర్చునేలా నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంది. అలాగే.. రాజ్యసభ 400 మంది కూర్చునేలా విశాలంగా ఉంటుందని తెలిపింది.

సీట్ల పెంపు నిజమైతే.. నెక్స్ట్​ ఏంటి?

లోక్​సభ సీట్ల సంఖ్యను పెంచాలంటే ముందుగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. జనాభా సంఖ్యను బట్టి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. మన దేశంలో పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు చట్టం చేసే అవకాశాన్ని రాజ్యాంగంలోని 82వ అధికరణం పార్లమెంటుకు ఇస్తోంది. ఈ చట్టం ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు ఓ కమిషన్​ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిషన్​ సిఫార్సులను మార్చేందుకు.. పార్లమెంట్​కు కూడా అధికారు లేదు.

ఈ కమిషన్​లో ఒక ఛైర్మన్​(రిటైర్డ్​ లేదా సిట్టింగ్​ సుప్రీం కోర్టు జడ్జి), భారత ప్రధాన ఎన్నికల అధికారి లేక ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఆయా రాష్ట్రాలకు చెందిన ఎన్నికల కమిషనర్లు, ఐదుగురు పార్లమెంట్​, శాసనసభ్యుల ఉంటారు. నియోజకవర్గాల పునర్విభజనకు పార్లమెంట్​తో పాటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి.

రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రణబ్​ ముఖర్జీ ఏం సూచించారు?

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ సైతం గతంలో సీట్ల పెంపు ఆవశ్యకతను వివరించారు. సీట్ల సంఖ్యను 1000కి పెంచాల్సిన అవసరం ఉందని 2019 ఎన్నికల సందర్భంగా అన్నారు. రాజ్యసభ స్థానాలూ పెంచాలని తెలిపారు. 1977లో మన దేశ జనాభా కేవలం 55 కోట్లేనని.. కానీ ఇప్పుడు అంతకు రెండింతలకు చేరుకుందని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్​ స్థానాలు పెరగాలని స్పష్టం చేశారు.

విపక్షాలు ఏమంటున్నాయి?

మనీశ్​ తివారితో పాటు.. లోక్​సభ స్థానాల పెంపు చేపట్టే ముందు ప్రజలతో విస్తృతంగా చర్చించి, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కార్తి చిదంబరం. భారత్​ లాంటి పెద్ద దేశాల్లో నేరుగా ఎన్నికయ్యే వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన చేపడితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం మరింత తగ్గిపోతుందని హెచ్చరించారు. అది ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇదీ చూడండి:సెంట్రల్​ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత

ABOUT THE AUTHOR

...view details