తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యూహం అంటే ఇది కదా- సీఎంల ఎంపికలో మోదీ, షా మార్క్- '2024లో అధికారం బీజేపీదే!'

BJP Plan For 2024 Election : హ్యాట్రిక్‌ రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికలో దూరదృష్టితో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రాల వారీగా ఉన్న సామాజిక సమీకరణలే కాకుండా ప్రాంతీయ ప్రాధాన్యతలకు పెద్ద పీట వేసింది. ఏ కులాన్ని కానీ వర్గాన్ని కానీ నిరాశపర్చకుండా పదవుల పంపకాలు చేపట్టింది. కమలనాథుల ఈ వ్యూహం వెనుక సార్వత్రిక ఎన్నికల మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

BJP Plan For 2024 Election
BJP Plan For 2024 Election

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 9:02 PM IST

Updated : Dec 12, 2023, 9:08 PM IST

BJP Plan For 2024 Election : వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు సమరానికి ముందు జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ సెమీస్‌గా భావించాయి. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకున్న కమలనాథులు కాంగ్రెస్‌ పాలనలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ కాషాయ జెండా ఎగురవేశారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా శాసనసభ సమరంలో సర్వశక్తులు ఒడ్డి మూడు రాష్ట్రాల్లో బంపర్‌ మెజార్టీ సాధించిన బీజేపీ ఆయా రాష్ట్రాల సీఎంల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందుకోసం వారం రోజులకుపైగా తీవ్ర కసరత్తు చేసింది.

సీనియర్​ నేతలను పక్కను పెట్టి మరీ
మూడు రాష్ట్రాల్లో సీనియర్‌ నేతలను పక్కన పెట్టిన కమలం పార్టీ పెద్దలు ఎవరి అంచనాలకు అందకుండా సీఎంగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణల్లో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను పక్కనపెట్టి మధ్యప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌కు పాలనా పగ్గాలు అప్పగించారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన నేత విష్ణుదేవ్‌ సాయ్‌ను, రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురితోపాటు ఉప ముఖ్యమంత్రుల ఎంపికలోనూ అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

విష్ణుదేవ్​ సాయ్​కే ముఖ్యమంత్రి పీఠం
Chhattisgarh New Chief Minister :ఛత్తీస్‌గఢ్‌ విషయానికొస్తే అక్కడ గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్ర జనాభాలో ఆ వర్గానికి చెందినవారు 32 శాతంగా ఉన్నారు. అందుకే ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్‌ సాయ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కమలం పార్టీ OBCని ముఖ్యమంత్రిని చేయవచ్చు. కానీ గిరిజనుల ప్రాబల్యమున్న స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో జయభేరి మోగించడం వల్ల ఆ సామాజికవర్గానికి చెందిన నేతనే సీఎంగా ఎంపిక చేశారు. ఇది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఉపకరిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్​ యాదవ్​కు అవకాశం
Madhya Pradesh New CM : మధ్యప్రదేశ్‌లో 163 స్థానాలతో బంపర్‌ మెజార్టీ సాధించిన బీజేపీ సీఎం అభ్యర్థి ఎంపిక పెద్ద సవాల్‌గా నిలిచింది. అన్నివర్గాలు సంతృప్తిపరిచేందుకు పెద్ద కసరత్తు చేయాల్సి వచ్చింది. సీఎంగా యాదవ్‌ వర్గానికి చెందిన మోహన్‌ యాదవ్‌ను ఎంపిక చేసిన బీజేపీ అధిష్ఠానం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించింది. దళిత వర్గం నుంచి జగదీశ్‌ దేవ్దాను, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాజేంద్రశుక్లాను ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టింది. ఠాకూర్‌ వర్గానికి చెందిన నరేంద్రసింగ్‌ తోమర్‌ను స్పీకర్‌గా ప్రకటించారు.

భజన్​లాల్​కే రాజస్థాన్ సీఎం​ పీఠం
Rajasthan New CM :రాజస్థాన్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఆ రాష్ట్ర జనాభాలో 7శాతంగా ఉంది. అందుకే ఆ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ఎంపిక చేశారు. ఆయన తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటికీ బీజేపీ సంస్థాగతంగా బలపడటం వల్ల కీలకంగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా నాలుగుసార్లు పనిచేశారు. సంఘ్‌తోనూ గట్టి అనుబంధం ఉండడం వల్ల కూడా శర్మకు కలిసివచ్చింది. రాజస్థాన్‌లో మిగితా సామాజికవర్గాలు నిరాశ చెందకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలనాథులు ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఒకరు రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన దియాకుమారి, మరొకరు దళిత వర్గానికి చెందిన ప్రేమ్‌చంద్‌ బైర్వాను ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

2024లో అధికారం చేపట్టేది మోదీ ప్రభుత్వమే- ఫిచ్ రేటింగ్స్ అంచనా
భారత్​లో 2024లో జరిగే లోక్​సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రానుందని ప్రముఖ ఏజెన్సీ ఫిచ్​ రేటింగ్స్​ సంస్థ​ అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా ఆ సంస్థ తాజా అంచనా. తద్వారా వరుసగా మూడోసారీ మోదీ ప్రభుత్వమే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విధానపరమైన సంస్కరణల పరంపర కొనసాగుతుందని పేర్కొంది. అధికారాన్ని దక్కించుకునే పార్టీకి వచ్చే మెజారిటీ సంస్కరణల ఎజెండాను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఫిచ్​ అంచనా వేసింది.

'3రాష్ట్రాల్లో బీజేపీ విజయం-2024లో హ్యాట్రిక్‌కు గ్యారంటీ- 'ఘమండియా' కూటమికి ఇదే వార్నింగ్​'

రాజస్థాన్ కొత్త​ సీఎంగా భజన్​లాల్ శర్మ- ఫస్ట్​ టైమ్​ ఎమ్మెల్యేకు పగ్గాలు

Last Updated : Dec 12, 2023, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details