పార్లమెంట్లో విపక్షాల చేస్తున్న నిరసనలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు. పెగసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో సభా కార్యకలాపాలు నిలిచిపోతుండటంపై మండిపడ్డారు. సభలో బిల్లులు ఆమోదించే సమయంలో విపక్ష సభ్యులు పేపర్లను చింపివేయడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం లాంటివి పార్లమెంట్, రాజ్యాంగాన్ని హేళన చేయడమేనని అన్నారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈమేరకు మాట్లాడారు.
వైద్య, దంత కళాశాలల్లో ఓబీసీ కోటాకు ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని భాజపా పార్లమెంటరీ పార్టీ స్వాగతించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. పార్లమెంటులో బిల్లులను చర్చించకుండానే ఆమోదించడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని తప్పుబట్టినట్లు జోషి వెల్లడించారు.