తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వచ్చే నెల నడ్డా పదవీకాలం ముగింపు.. అధ్యక్ష పదవిపై భాజపా కీలక నిర్ణయం! - భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం 2023

భాజపా అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలం వచ్చే నెలతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుందని తెలిసింది.

BJP National President JP Nadda
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

By

Published : Dec 20, 2022, 5:50 PM IST

భాజపా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మరికొద్ది కాలం కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. జనవరిలో దిల్లీ వేదికగా జరిగే భాజపా జాతీయ సంస్థాగత సమావేశంలో ఈ దిశగా అడుగులు పడనుందని సమాచారం. 2024లో జరిగే లోక్​సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని భాజపా భావిస్తోంది. అదే జరిగితే.. జేపీ నడ్డానే జాతీయ అధ్యక్షుడిగా మరికొంత కాలం కొనసాగనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

భాజపా జాతీయ సంస్థాగత సమావేశంలో.. 2023లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగనుంది పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా భాజపా జాతీయ కార్యవర్గం సమాలోచలను జరపనుందని వెల్లడించాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న సన్నద్ధతను సైతం సమీక్షించనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

వచ్చే నెలలో జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవి కాలం పూర్తవుతుంది. భాజపా పార్టీ విధానాల ప్రకారం జాతీయ స్థాయిలో సంస్థాగత ఎన్నికలు జరగాలంటే కనీసం సగం రాష్ట్రాలలో అంతర్గత ఎన్నికలు పూర్తి కావాలి. వరుసగా ఎన్నికలు ఉన్నా దృష్ట్యా ఇది సాధ్యపడదు. 2024 ఏప్రిల్​, మే నెలలో లోక్​సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ పక్రియ మొదలు కానుంది. అప్పటివరకు నడ్డానే అధ్యక్షునిగా కొనసాగే అవకాశముంది.

2019 జూన్​లో నడ్డా భాజపా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2020 జనవరిలో నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్ షా నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. 2019 పార్లమెంట్​ ఎన్నికలకు ముందు అమిషాకు కూడా ఇదే తరహాలో పదవీకాలం పొడిగించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండవసారి బాధ్యతల స్వీకరణ తరువాత షా కేంద్ర మంత్రివర్గంలో చేరారు. ఆ తరువాత నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీపై సంస్థాగతంగా పట్టున్న నడ్డాకు ఆర్​ఎస్​ఎస్​ నాయకత్వంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. మోదీ మద్దతు సైతం ఆయనకు ఉంది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈశాన్య రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details