రెండేళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి (jds congress govt in karnataka) భాజపా 'ఆపరేషన్ కమల్' కారణమంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తాజాగా అందుకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వీడేందుకు కాషాయ పార్టీ తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపగా నాలుక్కరుచుకున్న ఆ ఎమ్మెల్యే తానలా అనలేదంటూ మాటమార్చడం గమనార్హం. అసలేం జరిగిందంటే..
భాజపా ఎమ్మెల్యే శ్రీమంత్ బాలసాహెబ్ పాటిల్ (Shrimant Patil) ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. "భాజపాలో చేరేందుకు నాకు డబ్బు ఆఫర్ చేశారు. ఎంత కావాలంటే అంత అడగొచ్చని చెప్పారు. కానీ, నేను ఒక్క పైసా తీసుకోకుండా భాజపాలో చేరాను. అయితే, ప్రజలకు సేవ చేసేందుకు మంత్రి (shrimant patil minister) పదవి అడిగాను. కానీ, ఎందుకనో ప్రస్తుత ప్రభుత్వంలో నాకు మంత్రి పదవి రాలేదు. తర్వాతి మంత్రివర్గ విస్తరణలో నాకు పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చింది" అని వెల్లడించారు.
దుమారం..
పాటిల్ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ (DK Shivakumar) ట్విటర్ వేదికగా భాజపాపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. "ఆపరేషన్ కమల్‌లో భాగంగా పాటిల్‌కు డబ్బు ఆశజూపి భాజపాలోకి తీసుకున్నారు. ఇప్పుడైనా ఆయన నిజం చెప్పినందుకు ఆనందంగా ఉంది. దీనిపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని శివకుమార్ ట్వీట్ చేశారు.