తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా కీలక తీర్మానం- ఆ ఐదు రాష్ట్రాలే లక్ష్యం! - bjp national general secretary list

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో (BJP Executive Meeting) భాగంగా దేశంలో టీకా పంపిణీపై చర్చించినట్లు ఆ పార్టీ నేత నిర్మలా సీతారామన్ తెలిపారు. జమ్ముకశ్మీర్​ అభివృద్ధి దిశగా పయనిస్తోందని పార్టీ తీర్మానంలో పేర్కొన్నట్లు చెప్పారు. తీర్మానాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టగా.. పలువురు నేతలు మద్దతు ప్రకటించారు.

BJP National Executive Committee meeting
భాజపా కార్యవర్గ సమావేశం

By

Published : Nov 7, 2021, 3:16 PM IST

Updated : Nov 7, 2021, 9:02 PM IST

2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో (BJP National Executive Meeting) కీలక తీర్మానాన్ని భాజపా ఆమోదించింది. వివిధ అంశాలతో కూడిన పార్టీ తీర్మానాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశంలో ప్రవేశపెట్టారు. దానికి మద్దతు ప్రకటిస్తూ.. తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై, కిషన్ రెడ్డి, బిరెన్ సింగ్, అనురాగ్ ఠాకూర్, ప్రమోద్ సావంత్, అశ్వినీ వైష్ణవ్, పుష్కర్ ధామీ ప్రసంగించారు.

తీర్మానం చాలావరకు ప్రధాని మోదీని పొగడుతూనే సాగింది. కొవిడ్​పై పోరు, టీకా పంపిణీ కార్యక్రమం, పర్యావరణ మార్పులు, ఒకే దేశం ఒకే రేషన్ వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ తీర్మానం.. మోదీని ప్రశంసించింది. మోదీ పాలనతో విదేశాల్లో భారతదేశ ఖ్యాతి పెరిగిందని పేర్కొంది. విజయానికి సరికొత్త ప్రమాణాలను మోదీ సర్కారు నెలకొల్పిందని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో విజయం భాజపానే వరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

మరోవైపు, విపక్షాలపై తీర్మానంలో విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నట్లు భాజపా నేత నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ట్విట్టర్​కే పరిమితమై.. అనుమానాలు వ్యాప్తి చేశారని ఆరోపించారు. బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ హింసను వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. భాజపా కార్యకర్తలకు వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నాయని, దీనిపై న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.

కశ్మీర్​పై..

జమ్ముకశ్మీర్​ అభివృద్ధి దిశగా పయనిస్తోందని పార్టీ తీర్మానంలో పేర్కొన్నట్లు తెలిపారు నిర్మల. 2004-14 మధ్య కశ్మీర్​లో 2081 మంది పౌరులు ఉగ్రవాదానికి బలయ్యారని.. 2014-21 మధ్య ఆ సంఖ్య 239కి పరిమితమైందని వివరించారు. ఈ విషయాలన్నీ తీర్మానంలో పొందుపరిచినట్లు వెల్లడించారు.

గజమాలతో మోదీకి సత్కారం

సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని.. నేతలు సన్మానించారు. గజమాలతో సత్కరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులు, భాజపాపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలక చర్చ జరిగింది.

కరోనా ప్రబలిన తర్వాత తొలిసారి.. భాజపా జాతీయ కార్యవర్గం ప్రత్యక్షంగా సమావేశమైంది. ఇతర రాష్ట్రాల్లోని జాతీయ కార్యవర్గ సభ్యులు, నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'భాజపా శక్తిని ఇంకా పూర్తిగా చూడలేదు.. త్వరలోనే...'

Last Updated : Nov 7, 2021, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details